U19 Asia Cup : అండర్-19 ఫైనల్లో సంచలనం.. నఖ్వీ ముఖం మీదే మెడల్స్ తిరస్కరించిన భారత ఆటగాళ్లు

దుబాయ్ వేదికగా ఆదివారం (డిసెంబర్ 21) జరిగిన అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మైదానంలోనే కాకుండా మైదానం వెలుపల కూడా హైడ్రామా నడిచింది.

Update: 2025-12-22 05:20 GMT

U19 Asia Cup : అండర్-19 ఫైనల్లో సంచలనం.. నఖ్వీ ముఖం మీదే మెడల్స్ తిరస్కరించిన భారత ఆటగాళ్లు

U19 Asia Cup : దుబాయ్ వేదికగా ఆదివారం (డిసెంబర్ 21) జరిగిన అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మైదానంలోనే కాకుండా మైదానం వెలుపల కూడా హైడ్రామా నడిచింది. ఆటలో పాకిస్థాన్ విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకున్నప్పటికీ, భారత యువ ఆటగాళ్లు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా రన్నరప్ మెడల్స్ తీసుకోవడానికి టీమిండియా ఆటగాళ్లు ససేమిరా అనడం సంచలనం సృష్టించింది.

ఈ హైవోల్టేజ్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. పాక్ జట్టు పటిష్ట స్థితిలో ఉండటంతో, ట్రోఫీని అందజేయడానికి నఖ్వీ హుటాహుటిన దుబాయ్ చేరుకున్నారు. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత బహుమతుల ప్రదానోత్సవం సమయంలో భారత ఆటగాళ్లు నఖ్వీ ఉన్న వేదికపైకి వెళ్లడానికి నిరాకరించారు. నఖ్వీ పక్కనే నిలబడి ఫోటోలకు పోజులు ఇవ్వడానికి గానీ, ఆయన చేతుల మీదుగా మెడల్స్ తీసుకోవడానికి గానీ భారత కుర్రాళ్లు ఇష్టపడలేదు. చివరకు వేదిక పక్కనే ఐసీసీ అధికారి ఒకరు భారత ఆటగాళ్లకు మెడల్స్ అందజేశారు.

భారత జట్టు ఈ విధంగా ప్రవర్తించడానికి బలమైన కారణమే ఉంది. కొద్ది నెలల క్రితం జరిగిన సీనియర్ మెన్స్ ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ విజేతగా నిలిచింది. అప్పుడు కూడా ట్రోఫీని నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. మొహ్సిన్ నఖ్వీ కేవలం క్రికెట్ బోర్డు చీఫ్ మాత్రమే కాదు, పాకిస్థాన్ ప్రభుత్వంలో కీలక మంత్రి కూడా. భారత్‌కు వ్యతిరేకంగా ఆయన గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయనపై భారత క్రికెటర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ల బాటలోనే ఇప్పుడు జూనియర్ జట్టు కూడా నఖ్వీని పూర్తిగా విస్మరించడం గమనార్హం.

సీనియర్ ఆసియా కప్ సమయంలో టీమిండియా ట్రోఫీ తీసుకోకపోవడంతో నఖ్వీ మొండిగా వ్యవహరించారు. ట్రోఫీని భారత ఆటగాళ్లకు ఇవ్వకుండా నేరుగా తన హోటల్ గదికి తీసుకెళ్లడం అప్పట్లో పెను దుమారం రేపింది. ఆ వివాదం ఇంకా పచ్చిగానే ఉండటంతో, ఇప్పుడు అండర్-19 జట్టు కూడా అదే తరహాలో నిరసనను కొనసాగించింది. మొత్తం మీద భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నా, తెర వెనుక దౌత్యపరమైన, వ్యక్తిగత విభేదాలు మాత్రం ఇంకా తారాస్థాయిలోనే ఉన్నాయని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.

Tags:    

Similar News