Zimbabwe Team Coach: జింబాబ్వే టీంకి ఊహించని షాక్, కోచ్‌పై 8ఏళ్ల నిషేధం

Zimbabwe Team Coach: జింబాబ్వే టీంకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కోచ్ హీత్‌ స్ట్రీక్‌పై ఐసీసీ 8ఏళ్ల నిషేధం విధించింది.

Update: 2021-04-15 06:33 GMT

Heath Streak ( File Photo )

Zimbabwe Team Coach: జింబాబ్వే టీంకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కోచ్, మాజీ కెప్టెన్ 47 ఏళ్ల హీత్‌ స్ట్రీక్‌పై ఐసీసీ 8ఏళ్ల నిషేధం విధించింది. కోడ్‌ను హీత్‌ స్ట్రీక్‌ ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌ను ఉ‌ల్లంఘించినందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించింది. ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌ను హీత్‌ 5సార్లు ఉల్లంఘించారని ఐసీసీ వెల్లడించింది. ఈ విషయాన్ని ఐసీసీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ అలెక్స్ మార్ష‌ల్ వెల్లడించారు.

హీత్‌ స్ట్రీక్‌పై ఐసీసీ విచారణకు ఆటంకం కలిగించేలా వ్యవహరించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మొద‌ట్లో ఈ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన స్ట్రీక్‌..ఆ తర్వాత చేసిన తప్పును అంగీకరించాడు. ఇందుకు పశ్చాత్తాప పడుతున్నట్లు హీత్ చెప్పుకొచ్చాడు. స్ట్రీక్‌పై విధించిన నిషేధం 28 మార్చి 2029న తొలగిపోనుంది. హీత్‌ స్ట్రీక్‌ 2016 నుంచి 2018 వరకు జింబాంబ్వేకు, ఇతర దేశవాళీ లీగ్‌లలో జట్లకు కోచ్‌గా పనిచేశాడు. ఆ సమయంలో జరిగిన మ్యాచు‌ల్లోని అంతర్గత సమాచారం బుకీలకు చేరవేయడం, ఆటగాళ్లకు బుకీలను పరిచయం చేశాడనే పలు ఆరోపణలు అతని‌పై ఉన్నాయి.

ఇందులో కొన్ని అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఉండ‌గా.. ఐపీఎల్‌, బీపీఎల్‌, ఆఫ్ఘ‌నిస్థాన్ ప్రిమియ‌ర్ లీగ్‌ల‌లోని మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌ల ఫ‌లితాల‌పై అవి ఎలాంటి ప్ర‌భావం చూప‌లేద‌ని ఐసీసీ అవినీతి నిరోధ‌క శాఖ స్ప‌ష్టం చేసింది. ఓ మాజీ కెప్టెన్‌, కోచ్‌గా ఎన్నో అవినీతి నిరోధ‌క కౌన్సిలింగ్ సెష‌న్ల‌కు హాజ‌రైన స్ట్రీక్ ఇలా చేయ‌డం బాధాక‌ర‌మ‌ని అలెక్స్ మార్ష‌ల్ పేర్కొన్నారు. జింబాబ్వే తరపున హీత్ స్ట్రీక్‌ 189 వన్డేల్లో 239 వికెట్లు, 65 టెస్టుల్లో 216 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు.

Tags:    

Similar News