IPL 2020 Updates : పడిక్కల్..డీవిలియర్స్ హాఫ్ సెంచరీలు..సన్ రైజర్స్ విజయలక్ష్యం 164!

IPL 2020 Updates : పడిక్కల్.. డీవిలియర్స్ పరుగుల వరదతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలెంజింగ్ విజయలక్ష్యాన్ని సంరైజర్స్ ముందు ఉంచింది.

Update: 2020-09-21 16:13 GMT

IPL 2020 లో మూడో మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతోంది. టాస్ గెలిచి సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టుకు ఓపెనర్లు ఫించ్..పడిక్కల్ చక్కని ఆరంభం ఇచ్చారు. రెచ్చిపోయి ఆడిన ఈ ఇద్దరూ 5.2 ఓవర్లలోనే 50 పరుగుల భాగస్వామ్యం జోడించారు. హైదరాబాద్‌ ఎంతమంది బౌలర్లను మార్చినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ ఏభై పరుగుల భాగస్వామ్యంలో పడిక్కల్ (37), ఆరోన్‌ ఫించ్‌(12) పరుగులు ఉన్నాయి.

అదే ఊపును కొనసాగించిన పడిక్కల్ తన తోలి అర్ధశతకాన్ని నమోదు చేశాడు. అభిషేక్‌ శర్మ వేసిన 10వ ఓవర్‌లో పడిక్కల్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. నిజానికి ఈ ఓవర్ లో పడిక్కల్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు. ఓవర్‌ మూడో బంతికి గాల్లోకి లేచిన బంతిని రషీద్‌ ఖాన్‌ క్యాచ్‌ మిస్‌ చేయడంతో నాలుగు పరుగులు వచ్చాయి. దీంతో పడిక్కల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. మొత్తమ్మీద 10ఓవర్లకు బెంగళూరు స్కోరు 86/0. గా నమోదు అయింది.

అదే ఊపును కొనసాగించడంలో పడిక్కల్ విఫలం అయ్యాడు. 11వ ఓవర్‌ చివరి బంతికి శంకర్‌ బౌలింగ్‌లో పడిక్కల్ (56) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. తరువాతి ఓవర్ మొదటి బంతికే మరో ఓపెనర్ ఫించ్(29)‌ అభిషేక్‌ శర్మ బౌలింగ్‌లో ఎల్‌డబ్ల్యూగా వెనుదిరిగాడు. వరుసగా ఇద్దరు ఓపెనర్లను కోల్పోయిన దశలో కెప్టెన్ కోహ్లీ..డీవిలియర్స్ బ్యాటింగ్ కు వచ్చారు. వీరిద్దరూ తొందర పడకుండా ఆచి తూచి ఆడారు. ప్రధానంగా సింగిల్స్‌, డబుల్స్‌కే ప్రాధాన్యత ఇస్తూ వీరు ఆడడంతో 14 ఓవర్లకు బెంగళూరు జట్టు స్కోర్‌ 108/2గా నమోదైంది.

ఇక కోహ్లీ గేర్ మార్చే హడావుడిలో నటరాజన్‌ వేసిన 16వ ఓవర్‌ ఐదో బంతికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(14) భారీ షాట్‌ ఆడబోయి బౌండరీ లైన్‌ వద్ద రషీద్‌ఖాన్‌కు చిక్కాడు. దీంతో ఆ జట్టు 123 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. దీంతో 16 ఓవర్లకు స్కోర్‌ 124/3కి చేరింది.

ఇక చివర్లో డివిలియర్స్ మెరుపులు మెరిపించాడు. సందీప్‌ శర్మ వేసిన 19వ ఓవర్‌లో ఏబీ డివిలియర్స్‌ వరుసగా రెండు సిక్సులు బాదాడు. దీంతో జట్టు స్కోర్‌ 155/3కి చేరింది. చివర్లో ఫోర్లు, సిక్సులతో అలరించిన ఏబీ డివిలియర్స్‌(50) అర్ధశతకం బాది ఔటయ్యాడు. భువి వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి బంతిని బౌండరీ తరలించిన అతడు తర్వాత రెండు పరుగులు తీశాడు. మూడో బంతికి సైతం మరో రెండు పరుగులు తీయాలని చూశాడు కానీ.. రనౌటయ్యాడు. ఆపై జోష్‌ ఫిలిప్(1)‌ క్రీజులోకి రాగా శివమ్‌ దూబె(7) చివరి బంతికి రనౌటయ్యాడు. దీంతో బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. 

 IPL 2020 Live Updates : సన్ రైజర్స్ హైదరాబాద్..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!


Tags:    

Similar News