IPL 2020 Match 13Updates : ఒక బంతి + ఇద్దరు ఫీల్డర్లు = రోహిత్ ఔట్!

IPL 2020 Match 13 Updates : పంజాబ్ ఫీల్డర్ మాక్స్ వెల్ ఫీల్డింగ్ అద్భుతం బౌండరీ దాటుతున్న బంతిని ఆపి.. మరీ రోహిత్ శర్మ ను ఔట్ చేసి పెవిలియన్ చేర్చింది.

Update: 2020-10-01 17:15 GMT

Rohith Sharma Out (Image IPL twitter)

ఐపీఎల్ అంటేనే సంచలనం. పొట్టి క్రికెట్ తో పుట్టెడు వినోదం. టీ20 మ్యాచ్ లతో ఇన్స్టెంట్ మజా.. ఏ జట్టు అభిమాని అయినా.. అన్ని జట్లు ఆడే ఆటలూ ఆస్వాదిస్తాడు. ఎవరు గెలిచినా చప్పట్లు కొడతాడు. తన అభిమాన టీం ఓడినా ఆ ఆటలోని మజాను ఆస్వాదిస్తాడు. అందుకే ఐపీఎల్ సూపర్ సక్సెస్ క్రికెట్ లీగ్ గా నిలిచింది. కరోనా కారణంగా ఆలస్యం అయినా నేను రావడం పక్కా అంటూ ఎడారి దేశాల్లో ఐపీఎల్ 2020 సందడి చేస్తోంది.

ప్రతి మ్యాచ్ ఓ సంచలనంగా సాగుతోంది. టాప్ అనుకున్న జట్లు కుదేలు అవుతున్న పరిస్థితి.. ఈ స్కోరు చేధించడం కష్టం అనుకుంటే.. అవలీలగా రికార్డు చేధనతో గెలుపు గుర్రం ఎక్కేస్తున్నాయి కొన్ని జట్లు. ఇలా ప్రారంభం నుంచి అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ 13 వ సీజన్ లో ఇప్పటివరకూ ప్రత్యేకత ఏమిటంటే.. దాదాపుగా ఫీల్డింగ్ లో ప్రతి మ్యాచ్ లోనూ ఓ సంచలనం నమోదు అవుతుంది. బంతిని బౌండరీ లైన్ దాటకుండా చేయడానికి కుర్ర క్రికెటర్లు పడుతున్న కష్టం అదిరిపోతోంది. ఒక్కో మ్యాచ్ లో వారి ఫీల్డింగ్ విన్యాసాలు మ్యాచ్ ల జయాపజయాలను పూర్తిగా ప్రభావితం చేస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. అటువంటి ఒక అద్భుతం మళ్ళీ ఈరోజు కూడా జరిగింది. ఆ ఫీల్డింగ్ విన్యాసానికి ముంబాయి కెప్టెన్ మేటి బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ వెనుదిరిగాడు. ఆ క్యాచ్ విశేషం ఏమిటంటే..

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.. మొదటి ఓవర్లోనే ముంబై డికాక్ వికెట్ కోల్పోయింది.అనవసరపు పరుగు కోసం రోహిత్ చేసిన ప్రయత్నంలో సూర్యకుమార్ రనౌట్ అయిపోయాడు. ఇక అక్కడ నుంచి రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ తో కలిసి ఆచి తూచి ఆడాడు. రోహిత్ శర్మ 40 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తీ చేసుకున్నాడు. అది 17 వ ఓవర్ తోలి బంతి. తరువాత ఇక రోహిత్ వరుసగా సిక్స్లు.. ఫోర్లు బాదడం మొదలెట్టాడు. ఇక 18 వ ఓవర్ షమీ ప్రారంభించాడు. ఆ ఓవర్ మొదటి బంతిని రోహిత్ లాంగ్ ఆఫ్ దిశగా సిక్స్ గా మలిచే ప్రయత్నం చేశాడు రోహిత్. బంతి గాలిలో బౌండరీ వైపు వేగంగా వెళుతోంది.

ఈలోగా బౌండరీ లైన్ వద్ద వున్న మ్యాక్స్‌వెల్ పరిగెత్తుతూ వచ్చి గాలిలో ఎగిరి బౌదరీ లైన్ కు సరిగ్గా కొద్దిగా ముందు క్యాచ్ పట్టాడు. అయితే ఆ ఊపుకు తన బ్యాలెన్స్ కోల్పోయాడు. బౌండరీ లైన్ దాటి అవతల వైపు పడిపోబోయాడు. సరిగ్గా ఈ సమయంలో సమయస్ఫూర్తితో బంతిని అప్పుడే అక్కడికి పరిగెత్తి వచ్చిన ఫీల్డర్ నీషాం వైపు విసిరేశాడు. నీషాం ఏమాత్రం తడబాటు లేకుండా బంతిని అందుకున్నాడు. దీంతో రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. అంటే రోహిత్ శర్మను ఇద్దరు ఫీల్డర్లు కలిసి ఔట్ చేశారన్న మాట.

ఇక రోహిత్ అవుటయిన తరువాత వచ్చిన హార్దిక్ పాండ్య (11 బంతుల్లో 30 నాటౌట్), కీరన్ పోలార్డ్ (20 బంతుల్లో 47 నాటౌట్) ఆఖర్లో అదరగొట్టారు. వీరిద్దరూ 18వ ఓవర్లో 18 రన్స్,. 19వ ఓవర్లో 19 రన్స్... 20వ ఓవర్లో 25 రన్స్ జోడించడతో 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.

Tags:    

Similar News