IPL 2020 Match 21 Updates : మళ్ళీ పాత కథే.. కోల్ కతా బౌలర్ల ముందు సాగిలపడిన చెన్నై!

IPL 2020 Match 21 Live Updates and Live score : చెన్నై బ్యాట్స్ మెన్ ని కట్టడి చేసి విజయం సాధించిన కోల్ కతా బౌలర్లు

Update: 2020-10-07 18:33 GMT

అలవోకగా గెలవాల్సిన మ్యాచ్ అతి తేలికగా ఎదుటివారి చేతిలో పెట్టేశారు. ఎనిమిది కోట్లు పెట్టి కొన్న కేదార్ జాదవ్ చెన్నై కి భారీ ఓటమి తీసుకు వచ్చాడు. చివరి ఓవర్లలో 12 బంతుల్ని మింగేసిన అతను కేవలం ఏడు పరుగులు చేశాడు. మరో పక్క జడేజా లాంటి బ్యాట్స్ మ్యాన్ ఉండగా సింగిల్స్ తీసి అతనికి చాన్స్ ఇవ్వాలన్న సోయి కూడా జాదవ్ కు లేకుండా పోయింది. బ్యాటింగ్ లో ముందు వచ్చిన కెప్టెన్ ఎంఎస్ ధోనీ పది పరుగులతో సరిపెట్టుకున్నాడు. అతను అవుట్ అయ్యేటప్పటికి చెన్నై విజయం కోసం మూడు ఓవర్లలో 30 పరుగులు చేయాలి. అప్పటికే జాదవ్ ఉన్నాడు. అతనికి తోడుగా జడేజా ఉన్నాడు. ఈ స్థితిలో జడేజా 8 బంతుల్లో 21 పరుగులు చేశాడు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు జాదవ్ బ్యాటింగ్ ఎలా సాగింది అనేది.

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కోల్ కతా జట్టు నిర్ణీత ఓవర్లలో 167 పరుగులు చేసింది. త్రిపాఠి 51 బంతుల్లో ౮౧ పరుగులు చేశాడు. మిగిలిన వారంతా తక్కువ స్కోర్లె చేసినా త్రిపాఠి చక్కని ఇన్నింగ్స్ తొ కోల్ కతా ఆ మాత్రం స్కోరు సాధించింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన చెన్నై ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. డుప్లెసిస్ (17).. శివమ్‌ మావి వేసిన 3.4వ బంతికే ఔటైనా షేన్‌ వాట్సన్‌ దూకుడుగా ఆడాడు. అంబటి రాయుడు ( 30 పరుగులు 27 బంతుల్లో)తో కలిసి రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 12 వ ఓవర్ వరకూ మరో వికెట్ పడలేదు. అదీ కాకుండా రాయుడు, వాట్సన్ వరుసగా బాదుడు మొదలెట్టారు. మళ్ళీ చెన్నై విజయం నల్లేరుపై నడకలనే కనిపించింది. అయితే.. పదమూడో ఓవర్ మొదటి బంతికే నాగర్‌కోటి.. రాయుడిని అవుట్ చేశాడు. తరువాత కొద్దిసేపటికి వాట్సన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో వాట్సన్ ను నరైన్ ఎల్బీ గా వెనక్కి పంపాడు. జట్టు స్కోరు 129 వద్ద ఉండగా ఎంఎస్‌ ధోనీ (11; 12 బంతుల్లో 1×4)ను చక్రవర్తి క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో చెన్నై కష్టాల్లో పడిపోయింది. ఒక పక్క బంతులు తరిగిపోతున్నాయి.. మరో పక్క పరుగులు పేరుకుపోయాయి. ఈ దశలో జడేజా కొన్ని బౌండరీలు చేసినా అవి చెన్నైకి ఉపయోగపడలేదు. మొత్తమ్మీద 20 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై ఐదు వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి కోల్ కతా ముందు తల వంచింది.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు కూడా ఏమంత గొప్పగా బ్యాటింగ్ చేయలేదు. ఆ జట్టులో ఒక్క త్రిపాఠి తప్ప మరెవరూ రాణించలేదు. తరువాత బౌలింగ్ లోనూ మొదటి పది ఒవర్లలోనూ పరుగులు ఇస్తూ వికెట్లు తీయడానికి కష్టపడ్డ కోల్ కతా బౌలర్లు తరువాతి పది ఒవర్లలోనూ కచ్చితమైన బౌలింగ్ చేసి చెన్నైని కట్టడి చేశారు. బౌలర్లు అద్నరూ సమిష్టి కృషి చేశారు. దీంతో అందరూ (ఒక్క పాట్ కుమిన్స్ తప్ప) తలో వికెట్ తీశారు. 

Tags:    

Similar News