IND W vs SL W : వైజాగ్ వేదికగా ఇండియా పంజా.. లంక బ్యాటర్లను వణికించిన భారత బౌలర్లు..8 వికెట్ల తేడాతో భారీ విజయం
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025ను ముద్దాడి, విశ్వవిజేతగా నిలిచిన సరిగ్గా 48 రోజుల తర్వాత భారత మహిళల జట్టు మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టింది.
IND W vs SL W : వైజాగ్ వేదికగా ఇండియా పంజా.. లంక బ్యాటర్లను వణికించిన భారత బౌలర్లు..8 వికెట్ల తేడాతో భారీ విజయం
IND W vs SL W : ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025ను ముద్దాడి, విశ్వవిజేతగా నిలిచిన సరిగ్గా 48 రోజుల తర్వాత భారత మహిళల జట్టు మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టింది. ఆదివారం విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్ల హోదాలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే తమ ఆధిపత్యాన్ని చాటుతూ పర్యాటక శ్రీలంక జట్టును 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు భారత బౌలర్ల ధాటికి తలవంచింది. మూడో ఓవర్లోనే స్టార్ పేసర్ క్రాంతి గౌడ్ లంక కెప్టెన్ చామరి ఆటపట్టును క్లీన్ బౌల్డ్ చేసి భారత్‌కు శుభారంభం ఇచ్చింది. లంక ఓపెనర్ విష్మి గుణరత్నే (39) కాసేపు పోరాడినప్పటికీ మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన 20 ఏళ్ల స్పిన్నర్ వైష్ణవి శర్మ తన 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది.
స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ షెఫాలీ వర్మ వికెట్ కోల్పోయినప్పటికీ, మరో ఓపెనర్ స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను పక్కన పెట్టి మైదానంలోకి దిగిన మంధాన (25) కొన్ని అద్భుతమైన షాట్లతో అలరించింది. జెమిమాతో కలిసి రెండో వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. మంధాన అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (15*) సమన్వయంతో ఆడటంతో భారత్ 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.
ఈ మ్యాచ్‌లో హైలైట్ అంటే జెమిమా రోడ్రిగ్స్ బ్యాటింగ్ అనే చెప్పాలి. ప్రారంభం నుంచే లంక బౌలర్లపై విరుచుకుపడిన జెమిమా, కేవలం 44 బంతుల్లో 10 ఫోర్ల సహాయంతో అజేయంగా 69 పరుగులు చేసింది. తన క్లాస్ బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. బౌలింగ్‌లో దీప్తి శర్మ 4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి తలో వికెట్ దక్కించుకున్నారు. వరల్డ్ కప్‌లో చూపించిన అదే కసిని, పట్టుదలను టీమిండియా ఈ టీ20 ఫార్మాట్‌లో కూడా కొనసాగించడం విశేషం.