విగ్రహరూపంలో దర్శనమిచ్చే శివయ్య.. ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

Update: 2020-02-04 02:59 GMT

దేశంలో ఎన్నో శివాలయాలను దర్శించుకుని ఉంటాం. కానీ ఎక్కడా లేని విధంగా ముక్కంటి లింగాకారంలో కాకుండా విగ్రహరూపంలో అందులోనూ శయనిస్తూ ఒక్క ఈ ఆలయంలోనే భక్తులకు దర్శనం ఇస్తాడు. ఈ క్షేత్రానికి మరో చరిత్ర కూడా ఉంది. వాల్మీకీ మహర్షి ఇక్కడ తప్పస్సు చేసినందుకు ఈ ఆలయం విషేశం. అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది. ఈ ఆలయ విశిష్టత ఏంటి. ఈ ఆలయానికి ఎలా వెల్లాలి ఇప్పుడు చూద్దాం.

శివాలయాల్లోనే ఎంతో ప్రసిద్ది చెందిన  ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లో  నెలవై ఉంది. తిరుపతి నుంచి చెన్నై వెళ్లే దారిలోని సూరుటుపళ్లి అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది. పట్టచి చెట్లు, చుట్టూ పచ్చని పరిసరాలతో, సెలయేటి గలగలల మధ్య ఈ క్షేత్రం మనకు దర్శనం ఇస్తుంది. విషేశించి ఈ ఆలయం ప్రదౌశ పూజలకు ప్రసిద్ది చెందింది.

ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యానికి చెందిన హరిహర బుక్కరాయులు క్రీ.శ 1344-77 మధ్య నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి.

ఆలయ చరిత్ర..

సురుటు పల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్మామి నెలవై ఉండడం వెనుక ఆసక్తికర స్థల పురాణం ఉంది. దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మథించిన సమయంలో ఉద్భవించిన హాలాహలాన్ని విశ్వకల్యానార్థం పరమ శివుడు స్వీకరిస్తాడు. తరువాత పార్వతి, పరమేశ్వరులు తిరిగి కైలాసానికి పయనిస్తూ ఉండగా సరిగ్గా పళ్లి కొండేశ్వర క్షేత్రం వద్దకు రాగానే అంతటి పరమేశ్వరుడు కూడా విష ప్రభావానికి లోనవుతాడు. దాంతో స్పృహతప్పిన పరమశివుడు కాసేపు సర్వమంగళ స్వరూపిని అయిన పార్వతీదేవి ఒడిలో శయనిస్తాడు. పరమ శివుడు మింగిన విషం గరళ కంఠుని శరీరంలోకి పూర్తిగా జీర్ణం కాకుండా పార్వతీ దేవి శివయ్య కంఠాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఈ గరళాన్ని అమృతంగా మార్చడం వలన ఆ ఆలయంలో వెలసిన తల్లిని అముదాంబిక అని పిలుస్తారు. ఈ అద్భుత సంఘటనలకు విగ్రహ రూపమే ఈ సురుటుపల్లి దేవాలయం. ఈ ఆలయంలో శివుడు శయనించి దర్శనం ఇస్తున్నందుకు దీన్ని శివ శయన క్షేత్రం అనే పేరు వచ్చిందని చెపుతారు.

శివస్వరూపం..

శ్రీ పళ్లి కొండేశ్వరస్వామి ఆలయంలో గరళకంఠుని విగ్రహం దాదాపుగా 12 అడుగుల పొడవు ఉంటుంది. ఈ ఆలయంలోని విగ్రహం సమీపంలో దేవతలూ, రుషులూ చుట్టూ నిలబడి శివయ్యను ప్రార్థిస్తుండడం, పార్వతీ దేవి ఒడిలొ ముక్కంటి శయనిస్తూ ఉండే స్వామివారి విగ్రహ రూపం భక్తులకు దర్శనమిస్తుంది.

ఇక పోతే అభిషేక ప్రియుడైన శివునికి ఈ ఆలయంలో అభిషేకానికి బదులు తమిళనాడు నుంచి తెచ్చే చందన తైలాన్ని ప్రతి పదిహేనురోజులకు ఒకసారి పూస్తారు. శివుడు గరళాన్ని తీసుకున్న సమయంలో ఈ తేనెను పూయడం వలన విషప్రభావం తగ్గిందని చరిత్ర చెపుతుంది. దీంతో ప్రతి 15 రోజులకు ఒక సారి విష ప్రభావాన్ని తగ్గించడానికి తేనెలను పూస్తారు.

ఎవరిని ముందు దర్శించుకోవాలి..

ఈ ఆలయంలో వెలిసిన దేవతలలో మొదటగా అమ్మవారినే దర్శించుకోవాలని అక్కడి పండితులు చెపుతుంటారు. ఎందుకంటే శివుడి శరీరంలోకి విషం వెళ్ల కుండా పార్వతి దేవి రక్షించింది కాబట్టి ఈ క్షేత్రంలో వెలిసిన అముదాంబికను మొదట దర్శించుకుని అటు పై స్వామివారిని దర్శించుకోవాలని చెపుతుంటారు. అందుకే అమ్మవారిని లోకాలను కాపాడే జగదాంబ అని పిలుస్తారు.

ఈ ఆలయానికి ఇలా చేరుకోవచ్చు

ఈ ఆలయానికి వెళ్లాలనుకునే భక్తులు చిత్తూరు లేదా తిరుపతి నుంచి ముందుగా పుత్తూరు చేరుకోవాలి. అక్కడి నుంచి చెన్నైకి వెళ్లే మార్గంలో 21 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. పుత్తూరు నుంచి ప్రతి పావుగంటకు ఒక ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుంది. దాంతో పాటుగానే ప్రైవేటు వాహనాలు కూడా ప్రతి క్షణం అందుబాటులో ఉంటాయి. ఇక ఈ పళ్లి కొండేశ్వర స్వామి క్షేత్రానికి సమీపంలో తిరుపతి తిరుమల, కాళహస్తి, తలకోన, ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ తదితర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. 




Tags:    

Similar News