సూక్ష్మంలో మోక్షం.. గజేంద్ర మోక్షంలో ఇదే అంతరార్ధం

Update: 2019-08-21 10:05 GMT

పూర్వజన్మలవల్ల, కర్మలవల్ల వాటి వాసనల వల్ల ఏర్పడిన బంధాలతో ఇంద్రియ భోగంతో కూడిన అహం మొసలి కాగా... పట్టుబడ్డ మానవుడే గజేంద్రుడు. జనన మరణ చక్రంలో అనేకసార్లు పడి పరిభ్రమిస్తున్నమానవుడు ముక్తి పొందాలంటే అందుకు తనశక్తి మాత్రమే చాలదు. పరమాత్మ అనుగ్రహశక్తి పరిపూర్ణంగా కావాలి. ఆ అనుగ్రహం కోసం ఈ సంసార బంధాల నుంచి, ఇంద్రియభోగలాలసల నుంచి విముక్తి కల్గించమని ఆ పరమాత్మనే ప్రార్ధించాలి. ఈ భవసాగరంలో పడిన నన్ను రక్షించమని పరితపిస్తూ రక్షించేంతవరకు వేడుకోవాలి. పరమాత్మ పలికేంతవరకు ప్రార్ధన ఆపకూడదు - అచ్చంగా గజేంద్రుడులా!

తన పరివారంతో మోహంతో కూడి ఒక పెద్ద కొలనులో జలక్రీడలు సాగిస్తున్న గజేంద్రుడు, సంసార సాగరంలో ప్రాపంచిక పరివారంతో మనస్సుతో కూడి కదలాడుతున్న మానవునికి దర్పణం. గజేంద్రుడు మకరేంద్రుడు బారిన పడిన రీతిలో భవసాగరంలో మానవుడు ఆంతర్యామిని మరచి అహం అనే మకరం నోటిలో చిక్కుకొని దుఃఖితుడవుతున్నాడు. గజేంద్రుడు తనని తాను రక్షించుకోవడానికి ప్రయత్నం ప్రారంభించినట్లుగానే మానవుడు కూడా అహం అన్న భావం నుంచి బయటపడడానికి సాధన అన్న ప్రయత్నం చేయాలి. జలంలో మొసలికి బలం ఎక్కువ. ప్రాపంచిక సంసారంలో ఇంద్రియభోగలాలసత్త్వంను అలవర్చుకున్న అహంకు కూడా పట్టు ఎక్కువే. ఈ అహం నుంచి విడివడాలంటే తన సాధనాబలంతో పాటు ఈశ్వర అనుగ్రహం కావాలని గజేంద్రునిలాగా గ్రహించి త్రికరణశుద్ధిగా ఆ అనంతున్ని అర్ధించాలి.

కోరిక, కర్మ, అహం సమర్పణ చేస్తూ శరణాగతి స్థితికి వస్తే - అప్పుడు సుదర్శన చక్రమనే జ్ఞాతుతో అజ్ఞాన అహంభావనను సంహరించాకే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. జన్మ పరంపరల నుంచి విముక్తి పొందడమే ముక్తి. ఈ ముక్తి మరణాంతరం వచ్చేది కాదు, బతికుండగానే సాధించాల్సిన స్థితి. దీనిని తెలియజెప్పే కధనమే గజేంద్ర మోక్షం.  

Tags:    

Similar News