తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా దసరా వేడుకలు

✺ భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు ✺ రాజరాజేశ్వరీదేవి అవతారంలో దుర్గమ్మ ✺ ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ✺ భక్తులతో నిండిపోయిన క్యూలైన్లు

Update: 2019-10-08 03:50 GMT

తెలుగు రాష్ట్రాల్లో దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అన్నీ అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరిరోజైన విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని.. అమ్మవారిని రాజరాజేశ్వరీదేవిగా అలంకరిస్తారు. రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమి పర్వదినాన్ని చేసుకోవడం ఆనవాయితీగా ఏర్పడింది. శాశ్వతమైన ఆనందానికి, విజయానికి రాజరాజేశ్వరి ప్రతీక. కొద్దిపాటి విజయంతోనే ప్రయత్నాన్ని ఆపకుండా నిరంతర ఉద్యమంగా జీవితాన్ని సాగించాలనే స్ఫూర్తిని ఈ అవతారం నుంచి పొందవచ్చు.

రాజరాజేశ్వరీదేవిని అపరాజితాదేవి అనీ పిలుస్తారు. అన్ని లోకాలకు ఈమె ఆరాధ్య దేవత. దేవతలందరి సమష్ఠి స్వరూపంగా జ్యోతి స్వరూపంతో ప్రకాశిస్తూ పరమేశ్వరుడి అంకాన్ని ఆసనంగా చేసుకుంటుంది. శ్రీచక్రాన్ని అధిష్ఠించి, యోగమూర్తిగా దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీ మాతను ఈమెను పూజించటం ద్వారా మనోచైతన్యం ఉద్దీపితమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సమున్నతమైన దైవికశక్తికి ఈమె ప్రతీక. చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పు కలిగిఉండటం, ఉన్నతమైన భావనల్ని వ్యాప్తి చేయడం రాజరాజేశ్వరి అవతారం నుంచి మహిళలు అందుకోవాల్సిన స్ఫూర్తి. కుటుంబసభ్యులు నిర్వేదానికి గురైన సందర్భాల్లో వారిని ఓదార్చి, వారిలో పట్టుదల రేకెత్తించి లక్ష్యసాధన దిశగా ప్రేరేపించాల్సిన బాధ్యత మహిళలపై ఉంటుంది. ఇది గురుతరమైన బాధ్యత. దీన్ని సమర్థంగా నిర్వహించగలిగిన శక్తి కూడా మహిళలకు మాత్రమే ఉంటుందని రాజరాజేశ్వరీ అవతారం నుంచి సందేశాన్ని అందుకోవచ్చు. త్రిమూర్తుల కన్నా రాజరాజేశ్వరీదేవి ఉన్నతమైన స్థానం కలిగిఉంటుంది. ప్రపంచంలో అన్నిటికన్నా ఉన్నతమైన స్థానం మహిళకే ఉందనటానికి ఇది నిదర్శనం. పరిపూర్ణతకు ఈ అమ్మ అసలైన చిహ్నం. సృష్టిలో మరే ఇతర దైవానికి ఈ స్థాయి కలగలేదు. మహిళకు మాత్రమే దక్కిన అరుదైన గౌరవం ఇది.


Tags:    

Similar News