జనన మరణ చక్రం ఒక ఆటబొమ్మే... అద్భుతమైన లాజిక్‌!!

Update: 2019-08-14 10:51 GMT

గడిచిపోయిన సంఘటనల స్మృతి, వాటి ప్రతిస్పందనే మనసు. పరిణామ క్రమంలో, మనిషి నాడీవ్యవస్థ జరుగుతున్న సంఘటనలను ముద్రించుకుని దాచుకోవటం మొదలవుతుంది. వయసు పెరిగే కొద్దీ ఈ ప్రక్రియ పెరుగుతూ వస్తుంది. అనుభవాలు జ్ఞాపకాలవుతాయి. వాటిని నాడీవ్యవస్థ అనుక్షణం బయటపెడుతూనే ఉంటుంది. వర్తమానం, గతంలో జరిగినవాటితో పోల్చుకుని, భవిష్యత్తును వూహించటం మొదలవుతుంది. భయం, బాధ, సంతోషం, అనుమానం లాంటివి వ్యక్తమవుతూ ఉంటాయి. ఇవి జరుగుతున్నంతవరకు మనిషికి సుఖశాంతులుండవు. దీనినుంచి బయటపడాలంటే మనిషి జ్ఞానవంతుడు కావాలి. ప్రాపంచిక జ్ఞానం లౌకిక జీవితానికి అవసరం.

అలౌకిక ఆనందానికి ఆధ్యాత్మిక జ్ఞానమే సోపానం. అది గుండె లోతుల్లో నుంచి పుడుతుంది. అది పుట్టాలంటే భౌతిక ప్రపంచాన్ని చూడాలి, వినాలి. అది శరీరం లోపల చేసే సందడిని గమనించాలి. అది ఎక్కడినుంచి పుడుతుందో మూలాలను అన్వేషించుకుంటూ లోతుల్లోకి సాగిపోవాలి. కష్టమని విలాసాలు, వ్యసనాలవైపు మనసు మళ్ళిస్తే అసలైన ఆనందం చేజారినట్లే. అందుకే జరుగుతున్నవాటిని కాదు, వద్దు అని ఖండించకుండా, సమర్థించకుండా మనసును మౌనం చేయాలి. దానికి సాధనే మార్గం. కష్టం, నష్టం, అవమానం, అభిమానం, సుఖం, సంతోషం అన్నింటినీ లోపలనుంచి గమనిస్తూ ఉండటమే. మొదట శరీరం కష్టపడవచ్చు- సహనం వహించాలి. అదే సాధన. అప్పుడే ఆనంద సముపార్జన.

క్షీరసాగర మథనం జరిగితేనే అమృతం పుట్టింది. గరళం చూసి భయపడకుండా, కల్పతరువు, కామధేనువు లాంటి ఆశలకు, కోరికలకు లొంగిపోకుండా ముందుకు సాగితే అమృతధార అందుకోగలం. కష్టం, సుఖం ఏదైనా సరే- వాటిపట్ల మౌనం వహిస్తూ, అనుభవించినప్పుడు జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. మౌనం సిద్ధిస్తుంది. మోక్షానికి దారితీస్తుంది. 

Tags:    

Similar News