స్వయంవ్యక్త అర్చావతారం... సాలగ్రామ శిలాస్వరూపం

Update: 2019-08-20 15:51 GMT

తిరుమల శ్రీవారు స్వయం వ్యక్తమైన అర్చావతారం. సాలగ్రామ శిలాస్వరూపం. శ్రీవారి ధృవబేరం... శిల్పాశాస్త్రంలోని మహాపురుష లక్షణాలతో, ఉత్తమోత్తమ పరిణామాలతో మూలబింభం నిర్మితమైంది. స్వయం వ్యక్తంగా వచ్చిన ఎన్నో ఆభరణాలు, మకరకుండలాలు, కంఠాభరణాలు, కంకణాలు...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... ఎన్నెన్నో.... శ్రీవారి శిలాస్వరూపానికి అద్దినట్టు సరిపోయాయి. తిరుమల శ్రీవారి విగ్రహం ఎత్తు ఎంత? ఇప్పుడు ఏ విగ్రహానికైతే... పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయో... అవే పూజలు, అవే అభిషేకాలు యుగయుగాల నుంచీ జరుగుతున్నాయా? ఇప్పుడున్న విగ్రహానికే జరుగుతున్నాయా? అందులో తేడా ఏమీ లేదంటారు అర్చకస్వాములు.

కొంచం లోతుల్లోకి వెళ్దాం. వైకుంఠ విభుడి వైభవం తెలుసుకుందాం. శ్రీవారి మూలవిరాట్టు విగ్రహం ఎత్తు తొమ్మిదిన్నర అడుగులు. యుగయుగాల నుంచి ఇప్పుడున్న విగ్రహానికే పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. మొత్తంగా సాలగ్రామ శిలాస్వరూపంగా అలౌకికమైన పదార్థంతో శ్రీవారి విగ్రహం నిర్మితమైంది. శిల్పశాస్త్రంలోని మహా పురుష లక్షణాలు, ఉత్తమోత్తమ పరిణామాలతో శ్రీవారి ధృవబేరం ఉంది. కిరీటం, మకరకుండలాలు, ప్రలంబ యజ్ఞోపవీతం కంఠాభరణాలు, కంకణాలు, అంగుళీయకాలు నడుంపై ఉండే సింహలలాటమనే అలంకారం, ఉదరబంధం, పీతాంబరం, ఉత్తరీయం, శంఖచక్రాలు, అందెలు, పాగడాలు... ఇలా ఎన్నో శిలాస్వరూపానికే... అలంకారమై ఉన్నాయి. శ్రీవారిని శుక్రవారం దర్శించుకునే భక్తులకు ఈ నిజ రూప దర్శనం భాగ్యం కలుగుతుంది. దివ్యమంగళ స్వరూపం సాక్షాత్కరిస్తుంది.

ముందు నుంచే కాదు... వెనుక వైపు కూడా స్వామివారు చాలా సుందరంగా కనిపిస్తారు. భుజాలు వెడల్పుగా, సన్నటి నడుంతో, కుండలినీ స్వరూపంలో ఉండే కౌపీనం, భుజాల వరకు వంకీలుగా ఉన్న జుట్టు శిలాస్వరూపంగానే ఉంటుంది. శిలాస్వరూపానికే శిరచ్ఛక్రం కూడా ఉంటుంది. కంఠాభరణాలకు, బాజీబంధాలకు ఉండే పట్టుదారాల కుచ్చులు కూడా అందంగా మలచబడ్డాయన్నది అర్చకస్వాముల మాట. అందరూ అనుకుంటున్నట్టుగా కాలానికి అతీతుడైన స్వామివారికి నిజమైన కేశాలు లేవు. అలా ఉండే అవకాశాలే లేవంటారు అర్చకులు. ఎందుకంటే అశాశ్వతమైన మానవ లక్షణానికి నిదర్శనంగా చెప్పుకునే వెంట్రుకలు..... శాశ్వతుడైన శ్రీవారికి ఇలాంటి అశాశ్వతాలు ఉంటాయనడం అపనమ్మకమన్నది వారి అభిప్రాయం.

అలాగే శ్రీవారికి చెమట పడుతుందనీ, వీపు భాగం ఎప్పుడూ తడిగా ఉంటుందన్న మాట కూడా అబద్ధమేనంటారు. అదో మూఢనమ్మకంగా చెబుతారు వారు. చెమట పట్టడం మానవ లక్షణమనీ, చెమట పట్టడం పూర్తి అవాస్తవమనీ, స్వామివారి దివ్యమంగళ స్వరూపం, మూల విరాట్టు విగ్రహం ఉత్తమోత్తమ శిలా ప్రమాణాలతో నిర్మితమైనది. స్వయం వ్యక్తమైన అర్చావతార స్వరూపం. శిలాస్వరూపంగా కనిపించే స్వామివారి కేశాలు... ఉంగరాల జుట్టుతో, చివరన ఒత్తుగా, ఉంగరాలు తిరిగి వంకీలు వంకీలుగా భుజం కింద వరకు కనిపిస్తుందంటారు.

Tags:    

Similar News