ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర..

Update: 2019-07-01 02:18 GMT

అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైంది. జమ్ము బేస్ క్యాంపు నుంచి తెల్లవారుజామునే అమర్ నాథ్ యాత్రికుల తొలిబృందం బయలు దేరింది. 2,234 మంది యాత్రికుల తొలి బృందానికి జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సలహాదారుడు కేకే శర్మ జెండా ఊపి ప్రారంభించారు. భంభం భోలే నినాదాలతో భక్తులు ఆ పరమశివుడిని నామాన్ని స్మరిస్తూ.. యాత్ర ప్రారంభమైంది.

ఈ ఏడాది లక్షా ఎభైవేల మంది..

అమర్ నాథ్ యాత్రకు ఏటా లక్షలాది భక్తులు తరలి వెళుతుంటారు. ఈ ఏడాది యాత్ర కోసం లక్ష 50వేల మందికి పైగా నమోదు చేసుకున్నారు. సోమవారం ప్రారంభమైన యాత్ర ఆగస్టు 15న రక్షాబంధన్‌ నాడు ముగుస్తుంది. 46రోజుల పాటు సాగే యాత్ర, జమ్ము కాశ్మీర్‌లోని అనంత్‌ నాగ్ జిల్లా పహల్గాం నుంచి గాందర్‌బల్ జిల్లాలోని బాల్‌తాల్ మీదుగా సాగుతుంది.

పటిష్ట బందోబస్తు..

మొత్తం 2,234 మందిలో 1,228మంది పహల్గాం దారిలో వెళ్లనుండగా... 1006 మంది బాల్‌తాల్‌ వైపు నుంచి అమర్‌నాథ్ చేరుకుంటారు. వీరిలో 17మంది చిన్నారులు, 333 మంది మహిళలున్నారని అధికారులు వెల్లడించారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉగ్ర హెచ్చరికల నేపథ్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News