Pro Kabaddi Finals: ప్రోకబడ్డీ ఫైనల్స్ విజేత బెంగాల్ వారియర్స్

ఒత్తిడిని జయించి.. సరైన సమయంలో సరైన ఆట ఆడిన బెంగాల్ వారియర్స్ ప్రోకబడ్డీ సీజన్ 7 ఛాంపియన్ గా అవతరించింది. దబాంగ్ ధిల్లీ జట్టు మొదట్లో బాగానే ఆడినా చివర్లో వారియర్స్ కెప్టెన్ అహ్మద్ ధాటికి తలొగ్గింది.

Update: 2019-10-20 01:34 GMT

ప్రో కబడ్డీ ఛాంపియన్‌ షిప్ ఫైనల్స్ నువ్వా..నేనా అన్నట్టు సాగాయి. ప్రో కబడ్డీ ఎడో సీజన్ లో సంచలనమే నమోదు అయింది. ఇప్పటివరకూ ఆరు సీజన్ లలోనూ ఒక్కసారి కూడా ఫైనల్స్ కు చేరుకోలేని దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్ తమ అద్భుత ఆట తీరుతో తొలిసారిగా ఫైనల్స్ కు చేరి సంచలనం సృష్టించాయి. ఇక ఫైనల్స్ లో కూడా రెండు జట్లూ గట్టిగానే టైటిల్ కోసం ప్రయత్నించాయి. అయితే, ఒత్తిడిని జయించిన బెంగాల్ వారియర్స్ జట్టు కొత్త ఛాంపియన్ గా నిలిచింది.

ఫైనల్‌ మ్యాచ్ లో బెంగాల్ వారియర్స్ ప్రారంభం అంత బాగా జరగలేదు. ఒక్క పాయింటూ సాధించాక ముందే.. దబాంగ్ ఢిల్లీ 6-0తో దూసుకు వెళ్ళిపోయింది. అయితే, ఈ దశలో కెప్టెన్ మహ్మద్ బెంగాల్ వారియర్స్ జట్టును గదిలో పెట్టాడు. వరుస రైడ్ పాయింట్లతో గట్టి పోటీ ఇచ్చే స్థితిలోకి తన జట్టును తీసుకువెళ్ళాడు మహ్మద్. ఈ మ్యాచ్‌లో 13 సార్లు రైడ్‌కి వెళ్లిన మహ్మద్ 9 పాయింట్లతో చక్కని ఆటతీరు ప్రదర్శించగా.. డిఫెన్స్‌లో జీవా 4 పాయింట్లతో తన జట్టుకు ఆయువు పట్టులా నిలిచాడు. దీంతో.. హాఫ్ టైమ్‌ ముగిసే సమయానికి మ్యాచ్ 17-17తో సమమైంది.

సెకండాఫ్‌‌లో మాత్రం దబాంగ్ ఢిల్లీ తొలి ఐదు నిమిషాలు బెంగాల్ వారియర్స్‌కి గట్టి పోటీనిచ్చింది. దీంతో.. స్కోరు 18-18... 20-20తో సమమవుతూ వచ్చాయి. రెండు జట్లూ జాగ్రత్తగా పట్టుదలతో ఆడుతూ వచ్చాయి. ఈ దశలో మళ్లీ మహ్మద్ వరుసగా సూపర్ రైడ్‌లతో దబాంగ్ ఢిల్లీని ఆలౌట్ చేయడంతో.. ఒక్కసారి బెంగాల్ వారియర్స్ 30-24తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఈ దశ నుంచి ఢిల్లీ పుంజుకునేందుకు ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. ఢిల్లీ టీమ్‌లో స్టార్ రైడర్ నవీన్ కుమార్ 24 సార్లు రైడ్‌కి వెళ్లి 18 పాయింట్లు సాధించి శ్రమించినా, అతనికి డిఫెన్స్ నుంచి ఆశించినంత సహకారం లభించకపోవడంతో దబంగ్ జట్టుకు నిరాశ తప్పలేదు.

జులై 20న ప్రారంభమైన ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో మొత్తం 12 జట్లు పోటీపడ్డాయి. డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో లీగ్ దశ మ్యాచ్‌లు జరిగాయి. లీగ్ దశ ముగిసే సమయానికి టాప్-6లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించాయి. అనంతరం ఎలిమినేటర్స్, సెమీ ఫైనల్స్ తర్వాత.. దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్ ఫైనల్‌కి చేరాయి. లీగ్ దశలోనే తెలుగు టైటాన్స్ ఇంటిబాట పట్టింది.


Tags:    

Similar News