Yamuna River: 45 ఏళ్ల తర్వాత యమునా నది మహోగ్రరూపం..

Yamuna River: రాత్రికి వరద ప్రవాహం 207.72 మీటర్లకు చేరుతుందని అంచనా

Update: 2023-07-12 12:02 GMT

Yamuna River: 45 ఏళ్ల తర్వాత యమునా నది మహోగ్రరూపం.. 

Yamuna River: భారీ వర్షాలు ఉత్తరాదిన జల ప్రళయం సృష్టిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది మహోగ్రరూపం దాల్చింది. 45 ఏళ్ల క్రితం నాటి రికార్డును దాటి.. చరిత్రలో తొలిసారి నది నీటిమట్టం ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. దీంతో అనేక కాలనీల్లో వరద నీరు చేరింది. కేంద్ర జల కమిషన్‌ సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఢిల్లీ పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటి మట్టం 207.55 మీటర్లకు పెరిగింది.

మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీలో వరదలు పోటెత్తాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. గత 44 ఏళ్లలో యమునా నది ఇంత ఉధృతంగా ప్రవహించడం ఇదే తొలిసారి. ఉదయం నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ వచ్చింది. 1978 తర్వాత యమునా నదికి ఇంత పెద్ద ఎత్తున వరద రావడం ఇదే తొలిసారి అని ఢిల్లీ వరద నియంత్రణ విభాగం చెబుతోంది.

హరియాణా నుంచి నీటిని విడుదల చేయడంతో ఢిల్లీలో యుమనా నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ నది ప్రమాదకర స్థాయి 205.33 మీటర్ల కాగా.. ఆ మార్క్‌ను రెండు రోజుల క్రితమే దాటింది. 2013 తర్వాత మళ్లీ ఇవాళ ఉదయమే 207 మీటర్ల మార్క్‌ను తాకిన నది నీటిమట్టం. ఈ మధ్యాహ్నానికి ఏకంగా 207.55 మీటర్లుగా నమోదైంది. ఈ స్థాయిలో నది నీటిమట్టం పెరగడం ఇదే తొలిసారి.

1978లో యమునా నది నీటి మట్టం 207.49 మీటర్లకు చేరడంతో ఢిల్లీలో భీకర వరదలు సంభవించాయి. ఇప్పుడు ఆ రికార్డును కూడా దాటడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే తీర ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. మరోవైపు ప్రజలు నివసిస్తున్న కొన్ని కాలనీల్లోకి వరద ముంచెత్తింది. ఇళ్లు, మార్కెట్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

వరద పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఉన్నతాధికారులతో అత్యవసంగా సమావేశమయ్యారు. వరద ముప్పును ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, వరదలు సంభవించే అవకాశమున్న ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు ముందు జాగ్రత్తగా 144 సెక్షన్‌ విధించారు.

ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తుండటంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కేంద్రం జోక్యాన్ని కోరారు. యమునా నది నీటి మట్టం స్థాయిలు మున్ముందు పెరగకుండా చూడాలని ట్విటర్‌లో విజ్ఞప్తి చేశారు. కేంద్ర జలసంఘం అంచనా వేస్తున్నట్టు 207.72 మీటర్లకు నీటి మట్టం స్థాయి పెరిగితే.. ఢిల్లీకి ఇబ్బంది తప్పదన్నారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో వర్షాలు పడకపోయినప్పటికీ యమునా నది జలాలు అసాధారణ స్థాయిలో పెరుగుతున్నాయన్న కేజ్రీవాల్‌.. హరియాణాలోని హత్నికుండ్‌ బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడమే ఇందుకు కారణమని చెప్పారు.

Tags:    

Similar News