మమతా బెనర్జీతో చర్చలు సఫలం..వారంరోజుల ప్రతిష్టంభనకు తెర..

Update: 2019-06-18 02:00 GMT

పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెను విరమించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో వైద్యుల ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో తాము సమ్మె విరమిస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు. పశ్చిమబెంగాల్‌లో జూనియర్ వైద్యుల సమ్మెతో వారంరోజులుగా తలెత్తిన ప్రతిష్ఠంభనకు తెరదించేందుకు వైద్యుల ప్రతినిధులతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర సచివాలంలో సమావేశమయ్యారు. వైద్యుల భద్రత కోసం 10 భద్రతా చర్యలను మమతా బెనర్జీ ఈ సమావేశంలో సూచించారు. ప్రతి ఆసుపత్రిలో నోడల్ పోలీస్ అధికారిని ఏర్పాటు చేయాలని కోల్‌కతా పోలీస్ కమిషనర్ అనుజ్ శర్మను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యల పరిష్కారానికి సంబంధించిన గ్రీవెన్స్ రీడ్రెసెల్ సెల్ ఏర్పాటు చేయాలన్న వైద్యులు చేసిన ప్రతిపాదనకు మమత అంగీకరించారు. వైద్యులపై తప్పుడు కేసులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎన్‌ఆర్ఎస్ దాడి ఘటనలో ప్రమేయమున్న వారిపై తగిన చర్యలు తీసుకుంటామని, ఐదుగురిని అరెస్టు చేశామని కూడా ముఖ్యమంత్రి తెలిపారు.

వైద్యుల తరఫున ప్రతినిధులు సైతం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, అయితే తీవ్రమైన భయాందోళనల కారణంగానే తాము ఆందోళనకు దిగాల్సి వచ్చిందని వైద్యులు సీఎంకు వివరించారు. ఈనెల 11న వైద్యులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, గాయపడిన వైద్యులను ముఖ్యమంత్రి పరామర్శించాలని కోరారు. ఈ సమావేశం ముందుగా నిర్దేశించిన ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకే జరగాల్సి ఉండగా, చివరినిమిషంలో సమావేశానికి మీడియా కవరేజ్ ఉండాలని జూనియర్ డాక్టర్లు పట్టుబట్టడంతో ప్రభుత్వం ఆ డిమాండ్‌కు ఆమోదం తెలపడానికి మరికొంత సమయం పట్టింది. ఆ తర్వాత జరిగిన సమావేశంలో 31 మంది జూనియర్ డాక్టర్లు, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, సహాయ మంత్రి చంద్రిమా భట్టాచార్య, పలువురు ప్రభుత్వాధికారులు హాజరయ్యారు. 

Tags:    

Similar News