ప్రాణాన్ని కాపాడిన మనీ పర్స్

జేబులో ఉన్న మనీ పర్సు ఒక ప్రాణాన్నే కాపాడిన సంఘటన శనివారం ఫిరోజాబాద్‌లో చోటు చేసుకుంది.

Update: 2019-12-23 08:52 GMT
కానిస్టేబుల్‌ విజేందర్‌ కుమార్‌

జేబులో ఉన్న మనీ పర్సు ఒక ప్రాణాన్నే కాపాడిన సంఘటన శనివారం ఫిరోజాబాద్‌లో చోటు చేసుకుంది. ఇటీవలి పౌరసత్వ సవరణ చట్టం అమలు చేసినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే తరహాలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ సయంలోనే పోలీసులకు, నిరసనకారులకు తోపులాటలు జరిగాయి. ఆందోళనలు సమయంలో ఫిరోజాబాద్ ఎస్పీకి ఎస్కార్ట్‌గా విజేందర్ కుమార్ వెళ్లారు.

దీంతో నిరసనకారులు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. అదే సమయంలో నిరసనకారుల్లో ఒకరు తుపాకీని తీసుకుని పేల్చడంతో అక్కడే ఉన్న కానిస్టేబుల్‌ విజేందర్‌ కుమార్‌ (24) ఛాతీలోకి బుల్లెట్‌ దూసుకుపోయింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కలకలం రేగింది. సంఘటన జరిగిన వెంటనే విజయేందర్ ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాడు. వెంటనే తేరుకుని విజేందర్ తన ఛాతీ భాగాన్ని తడిమి చూసుకున్నారు. అంతే ఎక్కడ లేని ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదిలా ఉంటే తారు ధరించిన జాకెట్‌ను చీల్చుకుంటూ లోపలకు వెళ్లిన బుల్లెట్ అతడి చొక్కా జేబులో ఉన్న పర్స్‌లో చిక్కుకుపోయింది. అతని పర్సులో శివుడి ఫొటో, కొన్ని నాణేలు, నాలుగు ఏటీఎం కార్డులు ఉండడంతో అవి ఆ బుల్లెట్ ని అక్కడే నిలువరించి అతని ప్రాణాలను రక్షించాయి.

ఇదిలా ఉంటే నిరసనలో భాగంగా జరిగిన కాల్పుల్లో ధర్మేంద్ర అనే మరో కానిస్టేబుల్ గాయపడగా, కుమార్ త్రుటిలో తప్పించుకున్నారు. ఈ సంఘటనపై కుమార్ మాట్లాడుతూ ఆ భగవంతుడి దయవల్లే తాను ప్రాణాలతో బయట పడ్డానని తెలిపారు. ఇది తనకు పునర్జన్మని సంతోషం వ్యక్తం చేశారు. కాల్పులు జరిగిన సమయంలో తాను ధరించిన జాకెట్‌ కాపాడలేకపోయినా శివుడి ఫోటో, నాణేలు, ఏటీఎం కార్డులతో ఉన్న జేబులోని పర్స్ రక్షించిందని అన్నారు. కాల్పుల్లో గాయపడిన ధర్మేంద్ర ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News