United Airlines Flight: ల్యాండింగ్ సమయంలో ఊడిన విమాన టైర్.. పైలట్ చాకచక్యంతో తప్పిన ప్రమాదం
United Airlines Flight: అమెరికాలోని ఓర్లాండో ఎయిర్‌పోర్టులో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండ్ అవుతుండగా ముందు టైర్ ఊడింది. పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది.
United Airlines Flight: ల్యాండింగ్ సమయంలో ఊడిన విమాన టైర్.. పైలట్ చాకచక్యంతో తప్పిన ప్రమాదం
United Airlines Flight: అమెరికాలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి ప్రమాదం తప్పింది. రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం ముందుభాగంలో ఉన్న టైర్లలో ఒకటి అకస్మాత్తుగా ఊడిపోయింది. అయితే పరిస్థితిని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం, యునైటెడ్ ఫ్లైట్ 2323 చికాగోలోని ఓ’హేర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 8:55 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 12:35 గంటలకు ఓర్లాండో విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ విమానంలో సిబ్బందితో పాటు మొత్తం 206 మంది ప్రయాణికులు ఉన్నారు.
ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం కారణంగా విమానం ముందు భాగంలో ఉన్న రెండు టైర్లలో ఒకటి విడిపోయిందని అధికారులు తెలిపారు. దీనిని వెంటనే గుర్తించిన పైలట్, అత్యంత నైపుణ్యంతో విమానాన్ని అదుపులోకి తీసుకురావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రాణనష్టం జరగలేదని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. విమానంలోని ప్రయాణికులను బస్సుల ద్వారా టెర్మినల్‌కు తరలించినట్లు పేర్కొంది. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.