కరోనా విపత్తు ఎదుర్కోవడానికి ప్రజలకు భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం!

కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో కేంద్రం పలు నివారణ చర్యలు చేపట్టింది.

Update: 2020-03-26 16:24 GMT
Nirmala Sitharaman (File Photo)

కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో కేంద్రం పలు నివారణ చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా సుదీర్ఘ లాక్‌డౌన్‌ విధించింది. ఇప్పుడు లాక్‌డౌన్‌ సందర్భంగా ఇబ్బందులు పడే ప్రజల కోసం ఉద్దీపన పథకాన్ని ప్రకటించింది. డిల్లీలో ఈరోజు (మార్చి 26) ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకం వివరాలు తెలిపారు. సాధారణ ప్రజల ఆహార అవసరాలు, దినసరి అవసరాలకు సాయంగా గరీబ్‌ కల్యాణ్‌ స్కీమ్‌ పేరుతో 1.70 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు ఆమే తెలిపారు.

కేంద్రం ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీ ముఖ్య విశేషాలివే..

  శానిటేషన్‌ వర్కర్లు, ఆశా, పారామెడికల్‌, వైద్యులు, నర్సులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున ప్రత్యేక బీమా సదుపాయం.

♦  రానున్న మూడు నెలలకు ఒక్కొక్కరికి నెలకు 5కేజీల బియ్యం పంపిణీ చేస్తారు. కుటుంబానికి కిలో చొప్పున పప్పులు అందిస్తారు.

♦  ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా సాయం చేస్తారు.

♦  స్వయం సహాయక బృందాలకు రుణపరిమితి రూ.10లక్షలకు పెంచుతారు. ఎలాంటి పూచీకత్తు లేని రుణాలు అందజేస్తారు. దీనిద్వారా 63 లక్షల స్వయం సహాయక బృందాలకు లబ్ధి చేకూరుతుంది. దేశ వ్యాప్తంగా 20 కోట్ల మంది మహిళలకు మేలు జరుగుతుంది.

♦  ఉపాధిహమీ వేతనాలు రూ.182 నుంచి రూ.202కు పెంచుతారు.

♦  ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు అందజేస్తారు.

♦ 15వేల లోపు జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్‌ చందా కేంద్రమే భరిస్తుంది. ఉద్యోగి వాటా, యజమాని వాటాను కలిపి ఉద్యోగుల ఈపీఎఫ్‌ ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేస్తుంది. వంద మందిలోపు ఉద్యోగులు ఉన్న సంస్థలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే, ఆ వంద మంది ఉద్యోగుల్లో 90 శాతం మంది రూ. 15 వేలులోపు జీతం కలిగి ఉండాలి.

♦  ఉద్యోగులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా 75 శాతం వరకు పీఎఫ్‌ ఉపసంహరించుకోవచ్చు. 3 నెలల జీతం లేదా 75 శాతం పీఎఫ్‌లో ఏది తక్కువైతే దాన్ని ఉపసంహరించుకోవచ్చు.

♦  దేశవ్యాప్తంగా ఉన్న 3.5 కోట్ల మంది నమోదిత భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి రూ.31 వేల కోట్ల నిధి ఇప్పటికే ఉంది.ఈ ఆపత్కాలంలో వారి అవసరాల కోసం ఈ మొత్తాన్ని ఉపయోగిస్తారు.

దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనీ, ఖాళీ జేబులతో ఉండకూడదనీ ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు చర్యలు చేపట్టాలని కరోనాపై ఏర్పడిన ఎకనమిక్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఆదేశించాం అని సీతారామన్‌ ఈ సందర్భంగా వివరించారు.

Tags:    

Similar News