రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన సుష్మా స్వరాజ్

Update: 2019-08-07 00:50 GMT

పాతికేళ్ల వయసులోనే మంత్రిగా పనిచేసిన సుష్మాస్వరాజ్‌.. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఉన్నత పదవులను అధిష్టించారు. ఏడుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుష్మా... వివిధ హోదాల్లో పనిచేశారు. కేంద్ర మంత్రి పదవులు చేపట్టడమే కాకుండా, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగానూ వ్యవహరించారు. హర్యాణ లోని అంబాలా కంటోన్మెంటులో 1952లో జన్మినించిన సుష్మా.. కళాశాల విద్య వరకు అక్కడే ఉన్నారు. ఆ తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగర్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1970లలో విద్యార్థి దశలోనే ఆమె ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థి నాయకురాలిగా ఉద్యమం నడిపారు.

1975లో సుష్మాస్వరాజ్ వృత్తిరీత్యా న్యాయవాది అయిన స్వరాజ్ కౌశల్‌ను వివాహంచేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉన్నారు. భర్త స్వరాజ్ కౌశల్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా, మిజోరాం గవర్నర్‌గా పనిచేశారు. 1977లో జనతా పార్టీ తరఫున హర్యానా విధానసభ సభ్యురాలిగా ఎన్నికై 1982 వరకు ఆ పదవిని నిర్వహించారు. మళ్ళీ 1987లో రెండో సారి భారతీయ జనతా పార్టీ తరఫున హర్యానా విధానసభకు ఎన్నికయ్యారు. 1977 నుంచి 1979 వరకు దేవీలాల్ ప్రభుత్వంలో కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖల మంత్రిగా పనిచేశారు. 1984లో సుష్మాస్వరాజ్ బీజేపీలో చేరారు. 1987 నుంచి 1990 వరకు దేవీలాల్ నేతృత్వంలోని లోకదళ్-భారతీయ జనతా పార్టీ సంయుక్త ప్రభుత్వంలో విద్య, ఆరోగ్యం మరియు పౌరసరఫరాలశాఖ మంత్రిగా వ్యవహరించారు.

ఇక 1990లో సుష్మాస్వరాజ్ రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాలలో ప్రవేశించారు. అంతకు ముందు 1980, 1984, 1989లలో కార్నాల్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి పరాజయం పొందారు. 1996లో దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1996లో 13 రోజుల అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

1998లో 12వ లోక్‌సభకు మళ్లీ రెండో సారి దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై వాజపేయి రెండో మంత్రివర్గంలో మళ్లీ అదే శాఖలకు మంత్రిగా పనిచేశారు. మార్చి 19 నుంచి అదనంగా టెలికమ్యునికేషన్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడానికి 1998 అక్టోబరులో భారతీయ జనతా పార్టీ అధిష్టానం సుష్మాస్వరాజ్‌ను రంగంలో దింపింది. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో సుష్మా ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా సుష్మాస్వరాజ్ రికార్డు సృష్టించారు. ఇక 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సోనియా గాంధీ కర్ణాటకలోని బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. సోనియాగాంధీపై పోటీకి భారతీయ జనతా పార్టీ తరఫున సుష్మాస్వరాజ్‌ను బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో సుష్మాస్వరాజ్ ఓడిపోయినప్పటికీ.. సోనియాపై పోటీచేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు.  

Tags:    

Similar News