ముంబైలో కాంగ్రెస్‌, ఎన్సీపీ, సేన మహా బలప్రదర్శన

Update: 2019-11-25 17:01 GMT
ముంబైలో కాంగ్రెస్‌, ఎన్సీపీ, సేన మహా బలప్రదర్శన

మహారాష్ట్రలో మరోసారి హైడ్రామా నెలకొంది. రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. గంటకో ప్రకటనతో రాజకీయ నాయకులు సంచలనంగా మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిణామం​ చోటుచేసుకుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా బల ప్రదర్శన చేశారు.. ఈ మూడు పార్టీలకు చెందిన 162 ఎమ్మెల్యేలు ముంబైలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌ ఆవరణలో పెరేడ్ చేశారు..శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేతో పాటు, శరద్‌ పవార్‌ పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అశోక్ చవాన్, మల్లిఖార్జున్ ఖార్గేలు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ..ఇది మా బలం అంటూ 162 సంఖ్యను చూపుతూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు

అప్రజాస్వామికంగా గద్దెనెక్కిన బీజేపీ, అజిత్‌ పవార్‌ సంకీర్ణ ప్రభుత్వం కూలుతుందన్నారు ఎన్సీపీ చీఫ్‌ శరత్‌ పవార్. ప్రజల మద్దతు తమకే ఉందని... తమ మూడు పార్టీలు కలిసి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పారు. 145 మంది సభ్యుల బలం ఉంటే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమనే విషయాన్ని తెలిసి కూడా బీజేపీ నాయకులు బరితెగించారని విమర్శించారు‌.105 మందితో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారని నిలదీసిన ఆయన...ఇది గోవానో, మణిపూరో కాదన్నారు.

తమ పోరాటం అధికారం కోసం కాదని... రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికేనన్నారు శివసేన ఛీప్‌ ఉద్ధవ్‌థాకరే. సత్యమేవ జయతే నినాదంతో తాము అసత్యంపై పోరాటాన్ని ప్రారంభించామని చెప్పారు. సత్యం వైపునిల్చున్న తామే ఈ పోరాటంలో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఫడ్నవీస్‌ ప్రభుత్వం సత్యాన్ని పాతిపెట్టి సత్తాను అందుకుందని విమర్శించారు. అలాంటి వారిపై తాము పోరాటం చేస్తున్నామని... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం లేకపోయినప్పటికి బీజేజీ అజిత్‌పవార్‌ అధికారం కోసం అర్రులు చాశారని ధ్వజమెత్తారు.

ఎంపీ సంజయ్‌ రౌత్‌ మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీకి సవాలు విసిరారు. ప్రస్తుతం తమ వద్ద 162 మంది శాసనసభ్యులు ఉన్నారని.. అవసరమైతే స్వయంగా వచ్చి చూసుకోవాలని అన్నారు. ​ కాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు పూర్తి మెజార్టీ ఉందని.. కానీ బల నిరూపణకు గవర్నర్‌ అవకాశం ఇవ్వట్లేదన్నారు. ఈ బహిరంగ బలప్రదర్శన చూసైనా గవర్నర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు.

Tags:    

Similar News