దేశ ప్రజల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలందరూ మరికొన్ని రోజుల పాటు ‘లక్ష్మణ రేఖ’ దాటకుండా ఉండాల్సిందేనని మోదీ అన్నారు.

Update: 2020-03-29 07:36 GMT
Narendra Modi (File Photo)

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలందరూ మరికొన్ని రోజుల పాటు 'లక్ష్మణ రేఖ' దాటకుండా ఉండాల్సిందేనని మోదీ అన్నారు. ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తుందని, దాన్ని కట్టడి చేయడానికే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన ఈ కార్యక్రమంలో స్పష్టం చేశారు. తప్పని పరిస్థితుల్లోనే దేశంలో లాక్‌డౌన్‌ విధించాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

ప్రజలు తమని తాము కాపాడుకుంటూ తమ కుటుంబాల్ని కూడా కాపాడుకోవడానికే ఈ లాక్‌డౌన్‌ విధించామని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రజల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాని వెల్లడించారు. ఈ లాక్ డౌన్ వలన ఎంతో మంది సామాన్యప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకు తనని క్షమించాలని ఆయన ప్రజలకు వేడుకున్నారు. పొట్టకూటి కోసం వలస వచ్చిన కూలీలు, కష్టం చేకుంటేనే గాని పూటడవని రోజువారీ కూలీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారి బాధల్ని తాను అర్థం చేసుకోగలనని ఆయన వ్యాఖ్యానించారు. దేశ ప్రజల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాని వెల్లడించారు.

దేశంలో వైరస్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, ఈ సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని ప్రజలకు సూచించారు. ఈ క్రమంలోనే దేశంకోసం పోరాడుతున్న సైనికులను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ ధైర్యంతో కరోనాపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా సాగుతోన్న పోరాటాన్ని జీవన్మరణ పోరుగా అభివర్ణించారు. వైరస్ ను నియంత్రించి, ప్రజను కాపాడటానికి అహర్నిషలూ కష్టపడుతున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కృషి అమోఘమని ప్రధాని వారిని అభినందించారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలని ఆయన తెలిపారు. క్యారంటైన్, సామాజిక దూరం పాటించని దేశాల్లో పరిస్థితి దారుణంగా ఉందని దాన్ని ప్రజలంతా దృష్టిలో ఉంచుకోవాలన్నారు.

ఈ సందర్భంగా కరోనా బారినపడ్డ రామగంపా తేజ అనే బాధితుడు ప్రధానితో తన అనుభవాన్ని పంచుకున్నారు. వైరస్ సోకినపుడు మొదట ఎంతో భయపడ్డాను కానీ ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు తనకు ధైర్యం చెప్పారని, భరోసా ఇచ్చారని తెలిపాడు. అనంతరం ఆగ్రాకు చెందిన కరోనా బాదితుడు అశోక్ కపూర్‌ ప్రధానితో మాట్లాడినపుడు తమ కుటుంబంలోని ఓ వ్యక్తి ద్వారా వైరస్ వ్యాపించిందని, అతను ఇటలీ వెళ్లాడని, అక్కడే అతనికి వైరస్ సోకిందని తెలిపారు. ఆ తరువాతే మిగతావారికి వైరస్ సోకిందని తెలిపాడు.

Tags:    

Similar News