ఢిల్లీని కప్పేసిన కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం స్థాయి అత్యంత ప్రమాదకర స్థితిలోకి పడిపోయింది. మొన్న గురువారం రాత్రి నుంచి నమోదైన కాలుష్యం స్థాయిలు మరింత దిగజారి తొలిసారిగా వెయ్యి పాయింట్లు దాటాయి.

Update: 2019-11-03 11:12 GMT
Delhi polution

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం స్థాయి అత్యంత ప్రమాదకర స్థితిలోకి పడిపోయింది. మొన్న గురువారం రాత్రి నుంచి నమోదైన కాలుష్యం స్థాయిలు మరింత దిగజారి తొలిసారిగా వెయ్యి పాయింట్లు దాటాయి. దీంతో ఢిల్లీలో వాతావరణం విషపూరితంగా మారింది. గత కొన్నిరోజులుగా నగరం మొత్తం దట్టంగా పొగమంచు అలుముకుంది. పొగమంచులో తీవ్రస్థాయిలో హానికర వాయువులు చేరాయని కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకటించింది. ఇటు వాయుకాలుష్యం కారణంగా ఇవాళ ఢిల్లీకి రావాల్సిన 32 విమానాలను దారి మళ్లించారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా స్కూళ్లకు సెలవును వచ్చే మంగళవారం వరకు పొడగించారు. అలాగే పరిశ్రమలు మూసేయ్యాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉదయం 9 గంటల ప్రాంతంలో గాలి నాణ్యతా సూచీ 473 గా నమోదైంది. కాలుష్యానికి తోడుగా చినుకులు కూడా పడటంతో వాతావరణం చూడ్డానికి అందంగా కనిపించింది. కానీ ఆకాశమంతా మబ్బులతో కప్పి ఉండటంతో కొన్ని చోట్ల చీకట్లు అలుముకున్నాయి. దీంతో ఎదురుగా ఉన్న వారు కూడా కనిపించనంతగా ఉన్న వాతావరణంతో ప్రజలు నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. రోజంతా ఒకే రకమైన వాతావరణం ఉండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వస్తే బ్రీతింగ్‌ మాస్క్‌లను తప్పకుండా ధరిస్తున్నారు. ఇటు వాహనదారుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఎదురుగా వస్తున్న వెహికిల్‌ దగ్గరగా వచ్చే వరకు కనిపించకపోవడంతో కష్టాలు తప్పడం లేదు.

ఇటు కాలుష్యం ఈ స్థాయిలో పెరగడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ హర్యానా, పంజాబ్‌ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట వ్యర్థాలు కాల్చకుండా అడ్డుకోవాలని ఎప్పటివరకు చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి వాహనాలకు సరి బేసి విధానాన్ని అమలు చేస్తామన్నారు. అలాగే ట్రక్కుల ప్రవేశంపై కూడా నిషేధం విధిస్తామన్నారు. ప్రతీ ఏటా కంటే ఈ సారి ఢిల్లీ ప్రజలు క్రాకర్స్‌ తక్కువగా కాల్చారని పర్యావరణంపై ప్రజల్లో మంచి అవగాహన వచ్చిందని కేజ్రీవాల్‌ చెప్పారు.



Tags:    

Similar News