నిర్భయ కేసు : చివరిసారిగా కుటుంబసభ్యులను కలవనున్న దోషులు

Update: 2020-01-15 05:42 GMT

నిర్భయ నిందితులకు జనవరి 7న వారికి ఢిల్లీలోని పటియాలా కోర్టు జడ్జి సతీశ్‌ అరోరా డెత్‌ వారెంట్‌ జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు వారికి న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవచ్చనే అవకాశాన్ని కూడా కల్పించింది. దీంతో దోషుల్లో ఇద్దరైన వినయ్‌ శర్మ, ముఖేశ్‌ గతవారం మరణ శిక్ష అమలును సవాల్‌ చేస్తూ క్యురేటివ్‌ పిటిషన్‌ ను దాఖలు చేసారు. దీంతో న్యాయస్థానం ఈ పిటిషన్ పై నిన్న విచారణ జరపి జస్టిస్‌ ఎన్వీ రమణ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మధ్య పిటిషన్లను కొట్టి పారేసింది. ఇక వారికి మిగిలిన చివరి ఆశారేఖ రాష్ట్రపతి క్షమాభిక్ష ఒక్కటే. ఒకవేళ అది కూడా దక్కకపోతే నలుగురు హంతకులనూ ఈ నెల 22వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరి తీయడం అనివార్యం కానుంది.

ఈ నేపథ్యంలోనే నలుగురు దోషులు వారి కుటుంబసభ్యులను చివరిసారిగా కలిసేందుకు తిహార్ జైలు అధికారులు అవకాశం కల్పించారు. ఈ నెల 22న ఉదయం 7 గంటలకు తీహార్ జైలులో నిందితులను ఉరి తీయనున్నారు. ఇదిలా ఉంటే వినయ్‌, ముఖేశ్‌, పవన్‌, అక్షయ్‌లకు చివరిసారిగా వారి కుటుంబసభ్యులను కలిసేందుకు తేదీ చెప్పాలని తిహార్ జైలు అధికారులు కోరారు. 20 వతేది లోపే మాత్రమే తిహార్ జైలు సూపరింటెండెంట్ సమక్షంలో దోషులు వారి కుటుంబసభ్యులను కలిసి మాట్లాడాలని తెలిపారు. 20 వతేది తరువాత వారి కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించమని స్పష్టం చేసారు.

సాధారణంగా జైలు నిబంధనల ప్రకారం దోషులను ఇద్దరు కుటుంబసభ్యులు కలిసి అరగంట మాట్లాడేందుకు అనుమతిస్తారు. దీని ప్రకారమే నిందితులకు రిమాండ్ కు తరలించినప్పటి నుంచి కుమార్, శర్మ, గుప్తాల తల్లిదండ్రులు వారం వారం జైల్లో కలిసేవారు. కాగా సింగ్ కుటుంబసభ‌్యులు నవంబర్ నెలలో అతన్నిచివరిసారిగా కలిశారు. ఇక దోషులకు మరణ శిక్ష ఖరారు కావడంతో వారి కుటుంబసభ్యులను చివరిసారిగా కలిసే తేదీని ఖరారు చేస్తే వారి కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు అరగంటకు పైగా అనుమతించనున్నట్లు జైలు అధికారులు స్పష్టం చేసారు.




Tags:    

Similar News