ఆమె పెళ్ళికోసం రాష్ట్రపతి పర్యటన వాయిదా.. ఆయన సంస్కారానికి సాహో అంటున్న ప్రజ

Update: 2020-01-07 06:59 GMT

భారత రాష్ట్రపతి అంటే అత్యున్నత పదవి. దాని గౌరవం ఇతర ఏ పదవికీ ఉండదు. భారత రాష్ట్రపతి ఎక్కడికైనా వెళ్ళినా.. అక్కడ పగడ్బందీ ఏర్పాట్లు ఉంటాయి. అయన కోసం ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ పరిధిలోనే అన్ని జరుగుతాయి. సాధారణంగా రాష్ట్రపతి పర్యటన ఉన్న ప్రాంతాల్లో ముందుగానే ఏర్పాట్లు చేస్తారు. అయన భద్రత కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇవన్నీ తెలిసిన విషయాలే. మళ్లీ ఎందుకు చెబుతున్నామనేగా మీరనుకుంటున్నారు. దానికి కారణం ఉంది..

సాధారణంగా గల్లీ స్థాయి నాయకులే తమ పర్యటనలలో ఎంతో డాబు, దర్పం చూపిస్తారు.వాళ్ళు వస్తే ట్రాఫిక్ స్తంభించి పోతుంది. అక్కడ సాధారణ పౌరులు ఎటువంటి ఇబ్బందులకు లోనైనా సరే వారికి అనవసరం అన్న రీతిలో వ్యవహరిస్తారు. మన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన పర్యటనల కోసం పౌరులను ఇబ్బంది పెట్టడానికి ససేమిరా అంటారు.అందుకు ఉదహారణలు కోకొల్లలు ఉన్నాయి. అయితే, ఇటీవల జరిగిన రెండు సంఘటనలు మన రాష్ట్రపతి వ్యవహార శైలికి సంబంధించి అత్యున్నత విషయాలుగా నిలిచాయి. ప్రజలందరినీ ముగ్ధులను చేశాయి.

అందులో మొదటిది.. అయన శబరిమల యాత్ర.. ఇటీవల రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ శబరిమల దర్శనానికి వేల్లలనుకున్నారు. ఆ విషయం రాష్ట్రపతి భవన్ అధికారులు కేరళ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఐతే, అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి కావలసిన పరిస్థితులు లేవనీ, పైగా అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రాష్ట్రపతి ప్రోటోకాల్ ప్రకారం కావలసిన ఏర్పాట్లు చేయలేమని కేరళ అధికారులు రాష్ట్రపతి భవన్ కు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు ఈ విషయాన్ని రాష్ట్రపతికి తెలిపారు. వెంటనే రాష్ట్రపతి పరిస్థితిని అర్థం చేసుకుని తన పర్యటన కోసం సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టవద్దనీ, తన శబరిమల పర్యటన రద్దు చేసుకున్నారు.

ఇక కేరళలో కొచ్చిన్ లో తాజ్ కొచ్చి హోటల్ లో అమెరికన్ యువతి తన వివాహాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆమె పేరు ఆష్లే హాల్. దాదాపు ఎనిమిది నెలల క్రితం ఆమె తాజ్ కొచ్చి హోటల్ లో తన వివాహ వేడుకల కోసం గదులు, హాల్బు బుక్ చేసుకుంది. అయితే, సరిగ్గా ఆమె వివాహానికి 48 గంటల ముందు రాష్ట్రపతి కేరళ పర్యటన కోసం ఆయనకు అదే హోటల్ లో బస ఏర్పాటు చేశారనీ, ప్రోటోకాల్, భద్రతా కారణాల రీత్యా మీ వివాహానికి అక్కడ అనుమతి ఇవ్వలేమనీ హోటల్ వారు ఆమెకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె హతాశురాలయ్యారు. తానేప్పుడో హోటల్ బుక్ చేసుకున్నాననీ, వివాహానికి అతధులు కూడా వస్తున్నారనీ, కేవలం ఇంత స్వల్ప వ్యవధిలో తన వేదిక మార్చుకోవడం ఎలా కుదురుతుందనీ హోటల్ యాజమాన్యాన్ని ఆమె ప్రశ్నించారు. అయితే, వారు ఈ విషయంలో ఏమీ చేయలేమని చేతులు ఎత్తేశారు. దీంతో ఆమె తన పరిస్థితి వివరిస్తూ రాష్ట్రపతి భవన్ కు నేరుగా ట్వీట్ చేసింది. దాంతో విషయం రాష్ట్రపతికి చేరింది.

దానికి రాష్ట్రపతి కోవింద్ స్పందించారు. తన పర్యటన ఒకరోజు వాయిదా వేయమని అధికారులను ఆదేశించారు. అంతే కాదు అయన హాల్ కు వివాహ శుభాకాంక్షలు కూడా చెబుతూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. రాష్ట్రపతి హుందా తనాన్ని మెచ్చుకుంటూ.. అయన ఔదార్యానికి ఫిదా అయి పోయామంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మొత్తమ్మీద ఈ రెండు సంఘటనలు దేశ అత్యున్నత పౌరుడి అద్భుతమైన వ్యక్తిత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. నాయకులుగా పౌరులను ఇబ్బంది పెట్టడం కాదు.. వారి కోసం తగ్గి ఉండాలనే సందేశాన్ని రాష్ట్రపతి ప్రోటోకాల్ మాటున చెలరేగిపోయే నాయకులకు ఇచ్చినట్టైంది.

Tags:    

Similar News