'దిశ' నిందితులను డిసెంబర్ 31లోపు ఉరితీయండి: అన్నాడీఎంకే ఎంపీ

Update: 2019-12-02 07:22 GMT

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హైదరాబాద్‌ దిశ హత్యోదంతంపై రాజ్యసభలో చర్చ జరిగింది. దోషులను కఠినంగా శిక్షించాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్‌ చేశారు. కేసు విషయంలో జాప్యం లేకుండా త్వరగా నిర్ణయాలు రావాలన్నారు ఎంపీ కనకమేడల. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.

దేశంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందన్నారు ఎంపీ బండ ప్రకాశ్‌. ఇలాంటి దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు అమలు చేయాలన్నారు. మరోసారి తప్పు చేయాలంటేనే భయపడే విధంగా చర్యలు ఉండాలన్నారు.

ఆడపిల్లలపై దాడులకు పాల్పడిన ఘటనల్లో శిక్షలు వెంటనే అమలు చేయాలని రాజ్యసభలో ఎంపీ సుబ్బరామిరెడ్డి అన్నారు. దిశ ఘటనపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు శిక్షలు వెంటనే అమలు చేస్తేనే, ఇటువంటి ఘటనలు పునరావృతం కావని ఆయన అభిప్రాయపడ్డారు.

తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే ఎంపీ విజిలా సత్యనాథ్ డిమాండ్ చేశారు. నలుగురు నిందితులకు డిసెంబరు 31లోగా ఉరి శిక్ష వేయాలని అన్నారు. శిక్షలు వెంటనే అమలు కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

దిశ హత్య దేశం మొత్తాన్ని కలచివేసిందని కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ అన్నారు. చట్టాలు చేయడం ద్వారా మాత్రమే పరిష్కారం కాదని, సమస్య మూలాల నుంచి తొలగించడానికి సమాజం నిలబడాలని చెప్పారు. 

Tags:    

Similar News