ట్రాఫిక్ ఉల్లంఘనుల భరతం పడుతున్న మానెక్విన్‌.. బొమ్మే కదా అని నిర్లక్ష్యం చేస్తే..

Update: 2019-12-19 06:54 GMT
మానెక్విన్‌

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి కోసం బెంగళూరు పోలీసులు విన్నూత్న చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రధానమైన కూడళ్లు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసుల రూపంలో ఉండే మానెక్విన్‌లను ఏర్పాటు చేశారు. బొమ్మలే కాదా అని ఎవరైనా ట్రాఫిక్‌ ఉల్లంఘిస్తే ఇందులోని సీసీ కెమెరాలు ఫోటోలు తీసి చలాన్లు విధిస్తున్నాయి. హెల్మెట్ లేకపోయినా ర్యాష్ డ్రైవింగ్ చేసినా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపినా క్షణాల్లో చలాన్లు జారీ అవుతున్నాయి. ప్రస్తుతం నగరం 30 ప్రాంతాల్లో బెంగళూరు పోలీసులు వీటిని ఏర్పాటు చేశారు. వీటి పనితీరును ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు.

బొమ్మల గురించి తెలియక తొలుత ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినా ప్రస్తుతం చాలా వరకు ఉల్లంఘనలు తగ్గాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకపోవడంతో నగర వాసులు కూడా ఈ ప్రయత్నాలను స్వాగతిస్తున్నారు. మానెక్విన్ ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో వాహనాల వేగం పెరగడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తగ్గినట్టు చెబుతున్నారు. వీటి పనితీరుపై సోషల్ మీడియాలోనూ బెంగళూరు పోలీసులు అభిప్రాయాలు కోరుతున్నారు. నెటీజన్లు వ్యక్తం చేస్తున్న సందేహాలకు సమాధానమిస్తున్నారు.

మానెక్విన్‌ కాప్‌లతో తమకు సిబ్బంది కొరత తీరిందంటూ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. తాము ఎన్నిసార్లు చెప్పినా వినని వారు సైతం వీటికి భయపడి తమ తీరు మార్చుకుంటున్నారని చెబుతున్నారు. నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. మరో వైపు మానెక్విన్‌లపై నెటీజన్లు సోషల్ మీడియా తమదైన శైలిలో పోస్ట్‌లు పెడుతున్నారు. లంచాలు ఇచ్చే బాధతప్పిదంటూ కొందరు అందరికీ ఒకే చట్టమంటూమరోకరు పోస్ట్ చేస్తున్నారు. 

Tags:    

Similar News