మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే డిమాండ్

Update: 2020-05-26 01:54 GMT
Maharastra ex chief minister narayana rane meets governor bhagat singh koshyari

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే డిమాండ్ చేశారు. ఎంపీ నారాయణ్‌ రాణే రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీతో సోమవారం రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాణే ఆరోపించారు. మహారాష్ట్రలో అత్యధిక కేసులు, మరణాలు నమోదవుతున్నాయని గుర్తు చేశారు. భవిష్యత్‌లోనూ కరోనా మహమ్మారిని ప్రస్తుత ప్రభుత్వం కట్టడి చేయలేదని అన్నారు. కరోనా కట్టడిలో ఠాక్రే సర్కార్ కరోనా నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని రాణే మండిపడ్డారు.

కరోనా వైరస్‌ సంక్షోభంపై చర్చించేందుకు గత కొద్దిరోజులుగా బీజేపీ నేతలు గవర్నర్‌తో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ సైతం ఇటీవల గవర్నర్‌తో సమావేశమై కరోనా కట్టడి సహా పలు అంశాలపై చర్చించారు. ఇక మహారాష్ట్రలో ఇప్పటివరకూ 50,231 కరోనా కేసులు నమోదవగా 1635 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే ఉండడం విశేషం.

గత ఎన్నికల్లో రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజీపీ చివరి నిమిషంలో పవార్ ఎత్తుగడలకు అధికారం నుంచి దూరమయ్యింది. అయితే అప్పట్లో శివసేన, బీజేపీలు పోటీచేసినా అధికార పీఠానికి దూరం కావాల్సి వచ్చింది. ఈ విషయంపై అప్పట్నుంచి కసిగా ఉన్న రాష్ట్ర బీజేపీ నేతలు అవసరమైతే అధికారంలో ఉన్న కూటమిని దింపేందుకు పలు రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రస్తుతం కరోనా విలయాన్ని సాకుగా చూపించి మరోమారు తన అస్త్రానికి పదును పెట్టినట్టు తెలుస్తోంది. వరుసగా బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటంతో కేంద్రం భవిషత్తులో ఏ నిర్ణయం తీసుకుంటుందోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. 

Tags:    

Similar News