లాక్‌డౌన్‌-4: నిబంధనలు ఎలా ఉంటాయి.. ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారు..?

Update: 2020-05-13 07:02 GMT

మరో దశ లాక్‌డౌన్‌ తప్పదని తేల్చేశారు. నాలుగోదశ ఉంటుందని ప్రధాని మోడీ పరోక్షంగా చెప్పేశారు. అయితే ఈ సారి లాక్‌డౌన్‌ నిబంధనలు ఎప్పట్లాగ కాకుండా.. విభిన్నంగా ఉంటాయంటూ అందరిలో ఆసక్తిని రేపారు. రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి.. నిబంధనలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో లాక్‌డౌన్‌ 4 పాయింట్ ఓ.. ఎలా ఉంటుందో అన్న చర్చ మొదలైంది. నిబంధనలు ఎలా ఉంటాయి..? ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారు..? సడలింపులు, వెసులుబాట్ల విషయంలో ఎలాంటి ప్రణాళిక ఉండబోతుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాలుగో దశ లాక్‌డౌన్‌కు కావాల్సిన కొత్త రూపురేఖలు రూపొందించనున్నట్లు.. ప్రధాని మోడీ చెప్పారు. ఈ నెల 18 లోగా లాక్‌డౌన్‌ 4 గురించి ఆర్థికశాఖ వివరాలు వెల్లడిస్తుందని తెలిపారు. 

కరోనా మహమ్మారి వల్ల తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయిన దేశ ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా కేంద్రం కీలక ముందడుగు వేసింది. ఏకంగా జీడీపీలో 10 శాతం అంటే 20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ కుదేలైన పలు రంగాలకు ఊపిరులూదేందుకు ఈ ప్యాకేజీ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోట్లమందికి జీవనోపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ప్రత్యేక ప్యాకేజీ ఊపిరులూదుతుందన్నారు. ఉద్యోగులు, శ్రామికులు, రైతులతోపాటు దేశం కోసం కష్టపడే ప్రతీ ఒక్కరికి ఉపయుక్తంగా మారుతుందని చెప్పారు. ఇప్పటికే ప్రకటించిన గరీబ్ కళ్యాణ్‌ యోజన తాజా ప్యాకేజీలో అంతర్భాగమన్నారు. ఓ వైపు కరోనాను జయించడం మరోవైపు అన్ని రంగాల్లో స్వావలంబన సాధించడమే దేశం ముందున్న లక్ష్యమని మోడీ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News