Oommen Chandy: కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ కన్నుమూత

Oommen Chandy: 2004లో తొలిసారిగా కేరళ సీఎంగా ఉమెన్ చాందీ

Update: 2023-07-18 01:46 GMT

Oommen Chandy: కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ కన్నుమూత

Oommen Chandy: కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఊమెన్‌ చాందీ తనువుచాలించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ధ్రువీకరించారు. గతంలో గొంతు సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. అనంతరం ఉత్తమ చికిత్స కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.

ఊమెన్‌ చాందీ 1943 అక్టోబరు 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో జన్మించారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చాందీ.. తన నిజాయతీ, చిత్తశుద్ధితో పార్టీ అధినాయకత్వానికి విశ్వాసపాత్రుడిగా నిలిచారు. 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నుంచి 1970లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. తర్వాత ఎన్నడూ వెనుదిరిగి చూసుకోలేదు. ఆయన 12 సార్లు ఎమ్మెల్యేగా గెలవగా.. అన్నిసార్లూ పూతుపల్లి నియోజకవర్గం నుంచే విజయం సాధించారు. చాందీ 1977లో కె.కరుణాకరన్‌ కేబినెట్‌లో తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఊమెన్ చాంది 2004లో తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆతర్వాత 2011లోనూ రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఊమెన్ చాంది ఏనాడూ రాజకీయ ఫిరాయింపులకు పాల్పడని నాయకుడుగా రాణించారు. ఏపీ రాజకీయ వ్యవహారాల ఇన్ ఛార్జిగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.

ఊమెన్ ఛాందీ మరణంపట్ల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అ‎ధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్బ్రాంతి చెందారు. బెంగళూరులో రాజకీయ వ్యూహాత్మక సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనాయకులు ఇవాళ ఊమెన్ ఛాందీ భౌతిక కాయాన్ని సందిర్శించి, నివాళులు అర్పిస్తారు.

Tags:    

Similar News