Karnataka: డీజీపీ చాంబర్‌లో 'రాసలీలలు' కర్ణాటక టాప్ కాప్ రామచంద్రరావు సస్పెండ్.. వైరల్ వీడియోలతో అడ్డంగా బుక్కైన అధికారి!
కర్ణాటక డీజీపీ కె. రామచంద్రరావుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. తన కార్యాలయంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోలు వైరల్ కావడంతో ఈ చర్యలు తీసుకుంది. గతంలో ఈయన కుమార్తె రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే.
ఖాకీ వనంలో కలకలం రేగింది. రక్షణ కల్పించాల్సిన అధికారి తన చాంబర్‌నే రాసలీలలకు అడ్డాగా మార్చుకున్న వైనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తన కార్యాలయంలోనే మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపించడంతో.. కర్ణాటక ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీపీ కె. రామచంద్రరావును తక్షణమే సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
వైరల్ వీడియోల దెబ్బ.. అడ్డంగా దొరికిపోయిన 'టాప్ కాప్'
1993 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి డాక్టర్ కె. రామచంద్రరావు ప్రస్తుతం డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (DCRE) డీజీపీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, సోమవారం రాత్రి నుంచి ఆయనకు సంబంధించిన కొన్ని అభ్యంతరకర వీడియో క్లిప్పింగ్‌లు నెట్టింట హల్‌చల్ చేశాయి.
వీడియోల్లో ఏముంది?: యూనిఫాంలో ఉన్న డీజీపీ తన ఛాంబర్‌లోనే ఒక మహిళను కౌగిలించుకుని, ముద్దు పెట్టుకుంటున్న దృశ్యాలు ఆ వీడియోల్లో ఉన్నాయి. వేర్వేరు సమయాల్లో, వేర్వేరు మహిళలతో ఆయన సన్నిహితంగా ఉన్న మూడు వేర్వేరు క్లిప్పింగ్‌లను కలిపి ఎవరో సోషల్ మీడియాలో వదిలారు.
ప్రభుత్వ వేటు: ఈ వీడియోలు ప్రభుత్వం మరియు పోలీసు శాఖ పరువు తీసేలా ఉన్నాయని భావించిన ప్రభుత్వం.. సిబ్బంది, పరిపాలనా సంస్కరణల శాఖ (DPAR) ద్వారా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ప్రాథమిక ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు సర్కారు నిర్ధారించింది.
కూతురు గోల్డ్ స్మగ్లింగ్.. తండ్రి రాసలీలలు!
రామచంద్రరావు వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఈయన పెంపుడు కుమార్తె, నటి రన్యా రావు భారీ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయినప్పుడు కూడా ఈయన పేరు మారుమోగింది. ఆ సమయంలో కుమార్తెకు సహకరించారనే ఆరోపణలతో సెలవుపై వెళ్లిన రామచంద్రరావు.. తిరిగి విధుల్లో చేరిన కొద్దికాలానికే మళ్ళీ ఇలాంటి అసభ్యకరమైన వీడియోలతో అడ్డంగా దొరికిపోవడం గమనార్హం.
ఇదంతా ఎనిమిదేళ్ల నాటి కుట్ర: డీజీపీ వివరణ
సస్పెన్షన్ వేటు పడకముందు రామచంద్రరావు రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వరను కలిసి వివరణ ఇచ్చారు. ఈ వీడియోలు ఎనిమిదేళ్ల క్రితం తాను బెళగావిలో పని చేస్తున్నప్పుడు తీసినవని, వాటిని ఇప్పుడు మార్ఫింగ్ చేసి తనపై కుట్ర పన్నారని ఆయన వాదించారు. తన ప్రతిష్టను దిగజార్చడానికే ఎవరో పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తున్నారని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని ఆయన మీడియాకు తెలిపారు. అయితే విచారణ పూర్తయ్యే వరకు ఆయనను విధులకు దూరంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.