భారీ వర్షాలకు కూలిన భవనాలు : 15 మంది మృతి

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నాలుగు భవనాలు కూలి 15 మంది మృతి చెందిన విషాదకరమైన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

Update: 2019-12-02 04:59 GMT
తమిళనాడులో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలు

ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నాలుగు భవనాలు కూలి 15 మంది మృతి చెందిన విషాదకరమైన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే తమిళనాడులోని కోయంబత్తూరు మెట్టుపాళ్యంలో ఈ సంఘటన చోటుచేసుంది. రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

ఆ వర్షాల ధాటికి పాతకట్టడాల్లో నాలుగు భవనాలు రాత్రికి రాత్రే కూలిపోయాయి. రాత్రి పూట అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఈ సంఘటన జరగడంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. సంఘటన గురించిన సమాచారం అందుకున్న స్థానికులు, అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. మృతులు శిథిలాల కింద చిక్కుకోవడంతో ఎంతమంతి మృతులున్నారన్న విషయంపై అధికారికంగా సమాచారం ఇవ్వలేక పోతున్నారు.

తమిళనాడులో రెండురోజులుగా కురుస్తు్న్న వర్షాలకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వీటిలో ముఖ్యంగా చెన్నై, కాంచీపురం, కడలూరు, మదురై, కోయంబత్తూరు తదితర ప్రాంతాలలో శనివారం సాయంత్రం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల వారి పరిస్థితి మరీ అద్వాన్నంగా మారింది. రాకపోకలు, కనీస సౌకర్యాలు, విద్యుత్తు సౌకర్యం కూడా లేకుండా ఉంది. భారీ వర్షాల కారణగా పుదుచ్చేరితో పాటు మరో ఐదు జిల్లాలలోని విద్యాసంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్ లు సెలవు ప్రకటించారు.

రాష్ట్రంలో మరో రెండు రోజులు పాలు ఇలాగే భారీ వర్షాలు కురిసే అంకాశం ఉందని, అంతే కాకుండా ఈ నెల 15వ తేదీ నుంచి మరోసారి తమిళనాడును వర్షాలు ముంచెత్తనున్నాయని చెన్నై వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. మత్సకారులు చేపల వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  


Tags:    

Similar News