Jagadish Shettar: కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం జగదీష్ షెట్టర్
Jagadish Shettar: ఏఐసీసీ చీఫ్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ షెట్టర్
Jagadish Shettar: కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం జగదీష్ షెట్టర్
Jagadish Shettar: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. BJP నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ లింగాయత్ నేత జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో అలకబూనిన షెట్టర్... కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బెంగళూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే... జగదీష్ షెట్టర్‌ను తమ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి... పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో AICC ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్, సీనియర్ నేత సిద్దరామయ్య పాల్గొన్నారు. MLAగా, MPగా CMగా చేయడమే కాక బీజేపీ పటిష్టతకు ఎంతో కృషి చేసిన జగదీష్ షెట్టర్‌కు ఆ పార్టీ అన్యాయం చేసిందని ఆరోపించారు మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్ చేరిన షెట్టర్‌కు తాము సముచిత న్యాయం చేస్తామని ఖర్గే భరోసా ఇచ్చారు. లింగాయత్ వర్గానికి చెందిన షెట్టర్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ మరింత బలపడుతుందని ఖర్గే చెప్పారు.
హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి జగదీష్ షెట్టర్‌కు కాంగ్రెస్ టిక్కెట్ కేటాయించనుంది. జగదీష్ షెట్టర్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా, కర్నాటక సీఎంగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో జగదీష్ షెట్టర్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. తాను పెంచి, పోషించిన పార్టీ తనను అవమానించిందని, అసభ్యంగా ప్రవర్తించిందని ఆరోపించారు. రాష్ట్రంలోని కొంతమంది నేతలు బీజేపీ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని, ఇది బాధాకరమన్నారు. అయితే లింగాయత్ వర్గానికి చెందిన జగదీష్ షెట్టర్ పార్టీని వీడటం ప్రభావం చూపే అవకాశం ఉందని కర్నాటక సీఎం బొమ్మై అభిప్రాయపడ్డారు. అయితే లింగాయత్ సామాజిక వర్గం ఎప్పటికీ బీజేపీవైపే ఉంటుందని ఆయన ధీమాగా చెప్పారు.
లింగాయత్ వర్గానికి చెందిన జగదీష్ షెట్టర్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రత్యర్థి మహేష్ నల్వాడ్‌ను ఓడించి 21వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఇదిలా ఉంటే బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నేత లక్ష్మణ్ సవాది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల ముందు బీజేపీకి ఈ పరిణామాలు కొంత ఇబ్బందిగా మారాయి.