రాజధాని ఒకచోట.... హైకోర్టు మరోచోట.. దేశంలో పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి

Update: 2019-12-19 11:29 GMT

అమరావతిలో చట్టసభలు, కర్నూల్ లో హైకోర్టు అనే ప్రతిపాదన వచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడింది. తాజాగా మూడు రాజధానుల ముచ్చట కూడా తెరపైకి వచ్చింది. నిజానికి రాజధాని ఒక చోట హైకోర్టు మరో చోట ఉండడం భారతదేశానికి కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా ఇలాంటి సంప్రదాయాలు కొనసాగుతున్న రాష్ట్రాలు అనేకం ఉన్నాయి. అవేంటో చూద్దాం.

రాజధాని నగరంలోనే శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ కొలువుదీరడం సాధారణం. అయితే, ఈ మూడు వ్యవస్థలూ భిన్న ప్రాంతాల్లో కొలువై ఉండడం కూడా అసాధారణం ఏమీ కాదు. మన దేశంలోనే ఇందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాజధాని నగరం ఒకటైతే, హైకోర్టు ఉండే నగరం మరొకటి కావడం దేశంలో సాధారణ విషయంగా మారింది. ఎన్నో రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

ఉత్తరాన కశ్మీర్ నుంచి దక్షిణాన తమిళనాడు దాకా దేశంలోని ఎన్నో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రాజధాని నగరం ఒక చోట, హైకోర్టు మరో చోట కొలువైన ఉదంతాలు ఉన్నాయి. అండమాన్, నికోబార్ దీవుల విషయానికి వస్తే, దీని అడ్మినిస్ట్రేటివ్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ అయితే, జ్యుడిషియల్ క్యాపిటల్ మరో రాష్ట్రమైన పశ్చిమబెంగాల్ లోని కోలకతాలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటా నగర్ అయితే జ్యుడిషియల్ క్యాపిటల్ అసోం లోని గువాహతిలో ఉంది. అసోం పాలనాపరమైన రాజధాని డిస్ పూర్ అయితే, హైకోర్టు మాత్రం గువాహతి లో ఉంది. లెజిస్లేటివ్ క్యాపిటల్ కూడా గువాహతినే. చత్తీస్ గఢ్ విషయానికి వస్తే, అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ క్యాపిటల్ రాయ్ పూర్. జ్యుడిషియల్ క్యాపిటల్ మాత్రం బిలాస్ పూర్. దాద్రా, నగర్ హవేలి, దామన్ అండ్ దయు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ దామన్ అయితే, జ్యుడిషియల్ క్యాపిటల్ మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. గోవా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పనాజీ అయితే, లెజిస్లేటివ్ క్యాపిటల్ పోర్వోరిమ్ లో ఉంది. జ్యుడిషియల్ క్యాపిటల్ ముంబై కావడం విశేషం. గుజరాత్ అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ క్యాపిటల్ గాంధీనగర్ అయితే, జ్యుడిషియల్ క్యాపిటల్ అహ్మదాబాద్. ఇలాంటివే మరెన్నో ఉన్నాయి.

జమ్మూకశ్మీర్ విషయానికి వస్తే జమ్మూ కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ రాజధాని వేసవిలో శ్రీనగర్, శీతాకాలంలో జమ్మూ. మిగితా రెండు వ్యవస్థలు కూడా ఇలానే పని చేస్తాయి. లద్దాఖ్ విషయానికి వస్తే అడ్మినిస్ట్రేటివ్ రాజధాని లేహ్. దీని హైకోర్టు ఆరు నెలలు శ్రీనగర్ లో పని చేస్తుంది. మరో ఆరు నెలలు జమ్మూలో పని చేస్తుంది. కేరళ అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ క్యాపిటల్ తిరువనంతపురం అయితే, జ్యుడిషియల్ క్యాపిటల్ కొచి లో ఉంది. మధ్యప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ క్యాపిటల్ భోపాల్ అయితే, జ్యుడిషియల్ క్యాపిటల్ జబల్పూర్. మహారాష్ట్ర విషయంలో ఓ విశేషం ఉంది. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్, జ్యుడిషియల్ క్యాపిటల్ ముంబై. లెజిస్లేటివ్ క్యాపిటల్ విషయానికి వస్తే వేసవిలో ముంబైలో, శీతాకాలంలో నాగపూర్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. మిజోరం అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఐజ్వాల్ అయితే, జ్యుడిషియల్ క్యాపిటల్ గువాహతి. నాగాలాండ్ అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ క్యాపిటల్ కోహిమా అయితే, జ్యుడిషియల్ క్యాపిటల్ గువాహతి. ఇవే కాదు మరెన్నో రాష్ట్రాలకు కూడా అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ వేర్వేరుగానే ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ కు పొరుగునే ఉన్న ఒడిషాకు అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ క్యాపిటల్ భువనేశ్వర్ అయితే, జ్యుడిషియల్ క్యాపిటల్ కటక్. పుదుచ్చేరికి అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ క్యాపిటల్ పాండిచ్చేరి. జ్యుడిషియల్ క్యాపిటల్ మాత్రం మరో రాష్ట్ర రాజధాని చెన్నై గా ఉంది. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ క్యాపిటల్ జైపూర్. జ్యుడిషియల్ క్యాపిటల్ మాత్రం జోధ్ పూర్. ఉత్తరప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ క్యాపిటల్ లక్నో. జ్యుడిషియల్ క్యాపిటల్ మాత్రం అలహాబాద్ కావడం విశేషం. ఉత్తరాఖండ్ అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ క్యాపిటల్ డెహ్రాడూన్ అయితే జ్యుడిషియల్ క్యాపిటల్ మాత్రం నైనిటాల్. ఈ లెక్కన చూస్తే దేశంలో పలు రాష్ట్రాలు అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ ను వేర్వేరుగా కలిగిఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదన గనుక నిజమైతే, ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రాష్ట్రాల జాబితాలో చేరనుంది.

ఇలా వివిధ రాష్ట్రాలు అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియల్ క్యాపిటల్స్ గా వేర్వేరు నగరాలను ఎంచుకునేందుకు వివిధ చారిత్రక, ఆర్థిక, సామాజిక, పాలనాపరమైన కారణాలున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే రిపీట్ అవుతోంది. ఇక్కడ ప్రతిపాదిత మూడు నగరాలు కూడా రాజధాని నగరంగా ఉండేందుకు పోటీ పడ్డాయి. చివరకు ఈ మూడు నగరాలు కూడా మూడు భిన్న వ్యవస్థలకు కేంద్రాలుగా రాజధానులుగా మారనున్నాయి. అభివృద్ధి, పాలన ఒకే చోట కేంద్రీకృతమైతే ఒక్క నగరమే అభివృద్ధి చెందుతుంది. ఆ ఒక్క నగరం కూడా అంతంతమాత్రంగా ఉంటే మరెన్నో ఇబ్బందులు వస్తాయి. అలా గాకుండా అభివృద్ధి, పాలన వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుంటే వివిధ చారిత్రక, ఆర్థిక, సామాజిక, పాలనాపరమైన కారణాలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం మూడు నగరాలు మూడు భిన్న వ్యవస్థలకు కేంద్రాలుగా ఉంటే మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దేశంలోని వివిధ రాష్ట్రాల అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియల్ క్యాపిటల్స్ విభిన్న నగరాల్లో రూపుదిద్దుకోవడం వెనుక మరెంతో చరిత్ర కూడా ఉంది. బ్రిటిష్ హయాంలో మొదలైన సంప్రదాయాలూ ఉన్నాయి. నాటి నుంచి నేటి వరకూ పాత, కొత్త రాష్ట్రాల్లో అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియల్ క్యాపిటల్స్ విభిన్న నగరాల్లో ఏర్పడుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కూడా ఆ జాబితాలోకి చేరనుంది. 

Tags:    

Similar News