ఆరేళ్ల చిన్నారిపై గ్యాంగ్‌రేప్.. టెర్రస్‌పై నుంచి తోసి..!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో మనసును కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో మనసును కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ల పసిగుడ్డుపై అమానుషంగా అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, సాక్ష్యం లేకుండా చేసేందుకు ఆ చిన్నారిని ప్రాణాలతో బలిగొన్న ఉదంతం స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది.
బాధితురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం, వారి ఇంట్లోనే అద్దెకు ఉంటున్న రాజు, వీరు కశ్యప్ అనే వ్యక్తులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఇంటి డాబాపై ఆడుకుంటున్న చిన్నారిని లోబరుచుకున్న నిందితులు, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
విషయం బయటకు వస్తుందనే భయంతో ఆ చిన్నారిని టెర్రస్ పైనుంచి కిందకు తోసేశారు. ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో రక్తపు మడుగులో పడి ఉన్న బాలికను ఆస్పత్రికి తరలించేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది.
బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
నిందితులు ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో దాక్కున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో నిందితులు తప్పించుకోవడానికి పోలీసులపై కాల్పులు జరిపారు.
పోలీసులు జరిపిన ఆత్మరక్షణ కాల్పుల్లో (ఎదురుకాల్పులు) నిందితులిద్దరూ గాయపడ్డారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ప్రాథమిక విచారణలో నిందితులు తాము చేసిన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ అమానవీయ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.