రైతులకు శుభవార్త..24 గంటల్లో...

Update: 2019-06-07 14:35 GMT

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి పవనాలు వచ్చేస్తున్నాయి. 24 గంటల్లో కేరళను తాకబోతున్నాయి. రుతుపవనాల విస్తరణకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. నైరుతి ప్రభావంతో మలబారు తీరంలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయ్. ఆరెంజ్ అలర్ట్ జారీచేసిన అధికారులు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణం చల్లబడే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

వడగాల్పులు, ఎండలతో అల్లాడిన దేశ ప్రజలు సేద తీరే రోజులు వచ్చేశాయి. చినుకు కబురు కోసం ఎదురుచూస్తున్న రైతన్న ముఖంలో చిరునవ్వులు చిందించే సమయం ఆసన్నమైంది. వాతావరణశాఖ అంచనా ప్రకారమే నైరుతి రుతు పవనాల ఆగమనం మొదలవుతోంది. 24 గంటల్లో కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతున్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్ని తాకి భారత భూభాగంలోకి ప్రవేశించిన రుతుపవనాలు కొంత మందగించినా మళ్లీ ఇప్పుడు చురుగ్గా కదులుతున్నాయి. కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు.

పంటలు సాగు చేసేందుకు గ్రామీణ ప్రజలు ఎండల వేడి నుంచి ఉపశమనానికి పట్టన ప్రజలు దేశమంతా నైరుతి రుతుపవనాల కోసం ఎదురుచూస్తోంది. రుతుపవనాలు ఎప్పుడొస్తాయా చిరుజల్లులు ఎప్పుడు కురిపిస్తాయా అని ఆశగా చూస్తున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీగా వర్షాలు కురవనున్నాయని అధికారులు చెబుతున్నారు. కొల్లాం, అలప్పుళ, తిరువనంతపురం, ఎర్నాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రం అల్లకల్లలంగా మారుతుందని అలలు భారీ ఎత్తున ఎగసిపడతాయంటున్న అధికారులు ఆయా జిల్లాల్లో ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేశారు.

ఇక రుతుపవనాలు తమిళనాడు, తెలంగాణ, ఏపీని తాకేందుకు మరో మూడు, నాలుగు రోజుల సమయం పట్టవచ్చని ఐఎండీ తెలిపింది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన చిన్నపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ వారంతం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతోంది. రాజస్థాన్‌, ఢిల్లీ మధ్యప్రదేశ్‌, విదర్భ, ఉత్తరప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది.

Tags:    

Similar News