క్లైమాక్స్‌కి కర్నాటక సంక్షోభం.. మరికొన్ని గంటల్లో కన్నడనాట బలపరీక్ష..

Update: 2019-07-18 03:10 GMT

కర్నాటకలో రెబల్స్‌ ఆటకు నేడు ఎండ్‌ కార్డు పడనుంది. రెబల్స్‌ రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్‌దేనని సుప్రీం తేల్చిచెప్పడంతో.. నేడు జరగనున్న బలపరీక్షలో కుమారస్వామి భవితవ్యమెంటో తేలనుంది. అయితే, రేపటి విశ్వాస పరీక్షను వాయిదా వేయాలంటూ సంకీర్ణ సర్కారు కోరడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

కన్నడ కథ క్లైమాక్స్‌‌కి చేరింది. కుమారస్వామి భవితవ్యం నేడు తేలిపోనుంది. ఎమ్మెల్యేల రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్‌‌దేనన్న సుప్రీంకోర్టు బలపరీక్షకు హాజరుకావాలో? వద్దో? రెబల్స్‌ ఇష్టమమని, తాము బలవంతపెట్టలేమని తేల్చిచెప్పింది. అదే సమయంలో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు విప్‌ వర్తించదని క్లారిటీ ఇచ్చింది. చివరికి బంతి స్పీకర్‌ కోర్టులోకి రావడంతో, రాజ్యాంగ నిబంధనల మేరకు నిర్ణయం తీసుకుంటానని రమేష్ కుమార్ ప్రకటించారు.

అయితే, సుప్రీం తీర్పుతో కాంగ్రెస్‌‌-జేడీఎస్ సర్కారు ఇరకాటంలో పడింది. కర్నాటకలో మొత్తం 224మంది ఎమ్మెల్యేలు ఉండగా, 16మంది రాజీనామా చేశారు. ఒకవేళ రెబల్స్‌‌పై అనర్హత వేటేసినా, రాజీనామాలు ఆమోదించినా, సభ్యుల సంఖ్య 208కి తగ్గుతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా మ్యాజిక్ ఫిగర్‌ కూడా 105కి పడిపోతుంది. అదే జరిగితే కేవలం వంద మంది మాత్రమే సభ్యులన్న కుమారస్వామి సర్కారు కుప్పకూలడమే కాకుండా, 107మంది బలమున్న బీజేపీ అధికారాన్ని చేపట్టడం ఖాయంగా తెలుస్తోంది. ఏ రకంగా చూసినా పిక్చర్‌ మొత్తం కమలానికి అనుకూలంగా కనిపిస్తోంది.

ఇదిలాఉంటే, సుప్రీం తీర్పును బీజేపీ స్వాగతించింది. ఇది అసంతృప్తి ఎమ్మెల్యేల నైతిక విజయమన్నారు. కుమారస్వామి ప్రభుత్వానికి రేపే ఆఖరు రోజన్న యడ్యూరప్ప బలపరీక్షలో సంకీర్ణ సర్కారు కుప్పకూలడం ఖాయమన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ సైతం సుప్రీం తీర్పును ఆహ్వానించింది. ఆపరేషన్ లోటస్ విఫలమైందని, సత్యమేవ జయతే అంటూ వ్యాఖ్యానించింది. అయితే, బలపరీక్షలో కుమారస్వామి గట్టెక్కాలంటే రెబల్స్‌‌ను బుజ్జగించి దారిలోకి తెచ్చుకోవడం ఒక్కటే కాంగ్రెస్‌-జేడీఎస్‌ ముందున్న మార్గంగా కనిపిస్తోంది. రెబల్స్‌లో సగం మందిని తమ వైపు తిప్పుకున్నా సంకీర్ణ సర్కారు గట్టెక్కవచ్చు. అయితే రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు విప్ విర్తించదని, సభకు హాజరుకావాలో? వద్దో? వాళ్లిష్టమని సుప్రీం తేల్చిచెప్పడంతో మరి నేడు ఏం జరుగుతుందో చూడాలి. 

Tags:    

Similar News