భారీ వర్షాలు : యూపీలో నాలుగురోజుల్లో ఏకంగా 73 మంది మృతి

Update: 2019-09-29 13:20 GMT

దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వరదలకు కారణమైన వరుణుడు ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలపై పంజా విసిరాడు. బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్నిరోజులుగా కుంభవృష్టి కురుస్తోంది. యూపీలో నాలుగురోజుల్లో ఏకంగా 73 మంది మృతి చెందారు. ఎడతెరిపిలేని భారీ వర్షాలతో పలు రాష్ట్రాలు వరద ముంపునకు గురయ్యాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా నష్టం వాటిల్లింది. వరద తాకిడికి రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల్లో 73 మంది మరణించారు. తూర్పు ఉత్తర్‌ ప్రదేశ్‌లో పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాగరాజ్‌, వారణాసి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవడంతో సాధారణ జనజీవనానికి విఘాతం కలిగింది.

కుండపోతతో లక్నో, అమేధి, హర్దోయ్‌ సహా పలు జిల్లాల్లో స్కూళ్లు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలని డివిజనల్‌ కమిషనర్లు, జిల్లా మేజిస్ర్టేట్‌లను యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఆదేశించారు. వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ 4 లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు.

ఉత్తరాఖండ్‌లోని తెహ్రి జిల్లాలోని హేమకుంద్‌ సాహిబ్‌ మందిరాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్న యాత్రికుల వాహనంపై భారీ వర్షాల కారణంగా కొండచరియ విరిగిపడటంతో ఆరుగురు మృతిచెందారు. వర్షాలు.. మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌లను సైతం అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు రోజులుగా వరద తాకిడితో ఆరుగురు మరణించారని అధికారులు తెలిపారు.

రాజస్థాన్‌‌ దుంగార్‌పూర్‌ సమీపంలో భారీగా వదర నీరు చేరడంతో.. స్కూల్‌ విద్యార్థులు నీటిలో చిక్కుకున్నారు. 12 మంది విద్యార్థులను తీసుకెళ్తున్న ట్రక్కు వరదల్లో మునిపోయింది. దీంతో కొందరు విద్యార్థులు నీటిలో పడిపోయారు. విషయాన్ని గమనించిన స్థానికులు తాళ్ల సహాయంతో విద్యార్థులను కాపాడారు. 

Tags:    

Similar News