ఒక్క విందు.. 26 వేల మంది క్వారంటైన్..

Update: 2020-04-06 07:07 GMT

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన కలకలం రేపుతోంది. మురేనా నగరంలో ఓ వ్యక్తి ఇచ్చిన విందుతో ఏకంగా 26 వేల మంది క్వారంటైన్ లోకి వెళ్లటం అందరినీ షాక్ కి గురిచేస్తోంది.

దుబాయ్ లో వెయిటర్ గా పనిచేస్తోన్న మురేనా నగరానికి చెందిన ఓ వ్యక్తి తన తల్లి చనిపోవటంతో మార్చి 17న సొంతూరికి చేరుకున్నాడు.సంప్రదాయం ప్రకారం తల్లి చనిపోయిన మూడోరోజు విందు ఏర్పాటు చేశాడు. ఈ విందులో దాదాపు 12 వందల మంది పాల్గొన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. మార్చి 27న అసలు కథ మొదలైంది. ఆ వ్యక్తితో పాటు అతని భార్య కరోనా లక్షణాలతో హాస్పిటల్ లో చేరారు. వారిద్దరి రిపోర్ట్ ఈనెల 2న రాగా.. కరోనా పాజిటివ్ గా తేలింది.

ఆ తర్వాత విందులో పాల్గొన్న మరో పది మందికి కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విందుకు హాజరైన వారితో పాటు వారి కుటుంబసభ్యులు, వారితో సన్నిహితంగా మెలిగిన దాదాపు 26 వేల మందిని క్వారంటైన్ చేశారు.

Tags:    

Similar News