Renu Desai: సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు.. సైబరాబాద్ పోలీసులకు నటి రేణు దేశాయ్ ఫిర్యాదు
Renu Desai: సోషల్ మీడియాలో తనపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సైబరాబాద్ పోలీసులకు నటి రేణు దేశాయ్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Renu Desai
Renu Desai: సోషల్ మీడియా వేదికగా తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ వేధిస్తున్న గుర్తు తెలియని వ్యక్తులపై నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు అందజేశారు.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో తాను చేసే పోస్టులపై కొందరు వ్యక్తులు అత్యంత అసభ్యకరమైన పదజాలంతో కామెంట్లు చేస్తున్నారని తన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఇలాంటి వేధింపులు ఎక్కువయ్యాయని, తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఈ పోస్ట్‌లు ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Renu Desai: రేణు దేశాయ్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆమె ఫిర్యాదు మేరకు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ అసభ్యకరమైన వ్యాఖ్యలకు పాల్పడిన వారిని గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు.
అసలేం జరిగింది?
రేణుదేశాయ్(Renu Desai) ఆ మధ్య వీధి కుక్కల విషయంలో తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అప్పటి నుంచి ఆమెపై సోషల్ మీడియాలో కొంతమంది తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. ఆమె పోస్టులపై అసభ్యకర కామెంట్స్ పెడుతూ వస్తున్నారు. చెప్పలేని పదజాలంతో ఆమె పోస్టులకు కామెంట్స్ చేస్తున్నారు.
తాజగా కూడా ఆమెను సోషల్ మీడియాలో ఒక వ్యక్తి చాలా అసభ్యకరంగా మాట్లాడారు. ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. దీంతో రేణుదేశాయ్ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు.