నాగార్జున, ధనుష్, రష్మిక "కుబేర" సినిమా పై శేఖర్ కమ్ముల విశ్వాసం – రాజమౌళి, నటీనటుల స్పందన
కుబేర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున, ధనుష్, రష్మిక, శేఖర్ కమ్ముల ప్రసంగాలు ఆసక్తికరంగా నిలిచాయి. రాజమౌళి అతిధిగా పాల్గొన్న ఈ వేడుకలో సినిమా వెనుక ఉన్న భావోద్వేగాలను ప్రముఖులు పంచుకున్నారు. కుబేర సినిమా విడుదల జూన్ 20న.
నాగార్జున, ధనుష్, రష్మిక "కుబేర" సినిమా పై శేఖర్ కమ్ముల విశ్వాసం – రాజమౌళి, నటీనటుల స్పందన
పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానున్న "కుబేర" చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జూన్ 15న ఘనంగా నిర్వహించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా కీలక పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ డ్రామా జూన్ 20న విడుదల కానుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎస్.ఎస్. రాజమౌళి హాజరై చిత్ర బృందాన్ని ఆశీర్వదించారు.
"ఇది శేఖర్ కమ్ముల సినిమా – మేము పాత్రధారులం మాత్రమే": నాగార్జున
"ధనుష్ వంటి ప్రతిభావంతుడితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్‌ను విడిచిపెట్టి తీసిన సినిమా ఇది. మేము కూడా మన జోన్ నుంచి బయటపడ్డాం. ‘కుబేర’ అసలైన హీరో శేఖర్ కమ్ముల అని చెప్పొచ్చు. ఎన్నో రోజుల తర్వాత నాకు టీమ్ వర్క్ అనిపించింది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మరొక బలం" అంటూ నాగార్జున పేర్కొన్నారు. అలాగే, తన చిత్రం ‘శివ’ మళ్లీ విడుదల కానుందని అభిమానులకు తెలిపారు.
"సార్ కంటే ముందే కుబేర కథ వినాను": ధనుష్
"నాన్నగారి ముఖం గుర్తొచ్చింది ఈ వీడియో చూసినప్పుడు. ఆయన వల్లనే ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. ‘కుబేర’ నాకు తమిళంలో 51వ సినిమా, తెలుగులో రెండో సినిమా. కానీ ఇది ‘సార్’ కంటే ముందే చెప్పిన కథ. నాగార్జున సర్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. రష్మిక చాలా కష్టపడింది" అని ధనుష్ అన్నారు.
"కుబేర అనేది నిజమైన పాన్ ఇండియా మూవీ": శేఖర్ కమ్ముల
"ఈ సినిమా నాకు తల్లిలాంటి సినిమా. ధనవంతుడైనా, యాచకుడైనా తల్లి ప్రేమ ఒకటే. ఈ సినిమాను తీసినందుకు గర్వంగా ఉంది. ఎమోషన్, కామెడీ, థ్రిల్ అన్నీ కలిపిన ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. నా శైలికి భిన్నంగా ఉంటుంది. నాగార్జున గారితో పనిచేయడం ప్రారంభంలో ఒత్తిడిగా అనిపించింది కానీ, ఆయన స్క్రిప్ట్ వినగానే ఒప్పుకున్నారు. ధనుష్ తన పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నగా మారారు. ఫస్ట్ షాట్ తోనే ఆయన నటన నాకు ఇంప్రెస్ చేసింది" అని శేఖర్ అన్నారు.
"నా కల నెరవేరింది": రష్మిక మందన్నా
"ఈ సినిమా షూటింగ్ సమయంలో నా ఫ్యామిలీని కలిసే అవకాశం రాలేదు. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో నటించడం నా డ్రీమ్. ఇది నాగార్జున సర్‌తో రెండో సినిమా. ఆయన మంచి మనిషి. ధనుష్‌తో మా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. భవిష్యత్‌లో మళ్లీ కలిసి నటించాలనుంది" అని రష్మిక తెలిపారు.