Little Hearts biggest blockbuster 2025- ఈ ఏడాది అతి పెద్ద ‘హిట్’ ఓజీ కాదు

పెట్టుబడి–రాబడి పరంగా ఈ ఏడాది నిజమైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది చిన్న సినిమా ‘లిటిల్ హార్ట్స్’. కేవలం ₹2.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ₹40 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ట్రేడ్‌లో సంచలనంగా మారింది.

Update: 2025-12-30 12:48 GMT

సంవత్సరం ముగింపు దశలోకి చేరుతుండగా, ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో ఏ సినిమాలు అదరగొట్టాయి, ఏవి నిరాశపరిచాయి అనే చర్చ మళ్లీ మొదలైంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు లేకపోవడం ఈ ఏడాది బాక్సాఫీస్‌కు పెద్ద లోటు. ప్రభాస్, అల్లు అర్జున్, చిరంజీవి, నాగార్జున సినిమాలు ఏవీ రిలీజ్ కాకపోవడం ఫ్యాన్స్‌కే కాదు, ట్రేడ్‌కు కూడా నిరాశే.

జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌ ‘వార్ 2’లో కనిపించినా, అది పూర్తిస్థాయి హీరో రోల్ కాదని చెప్పాల్సిందే. రామ్ చరణ్‌ ‘గేమ్ చేంజర్’తో షాకింగ్ అనుభవం ఎదుర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’తో అభిమానులను అలరించినా, ‘హరిహర వీరమల్లు’ మాత్రం నిరాశపరిచింది. బాలయ్య నటించిన ‘డాకు మహరాజ్’ ఓ మోస్తరు విజయాన్ని అందుకోగా, ‘అఖండ 2’ ఆశించిన స్థాయికి చేరలేదు. వెంకటేష్‌ హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంచనాలకు మించి ఆడింది. నాని చిత్రమైన ‘హిట్ 3’ కూడా మంచి ఫలితాన్నే అందుకుంది.

అయితే పెట్టుబడి – రాబడి పరంగా చూస్తే ఈ ఏడాది సూపర్ సెన్సేషన్, బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది ఓ చిన్న సినిమా — ‘లిటిల్ హార్ట్స్’. కేవలం ₹2.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, ఊహించని రీతిలో కలెక్షన్లను రాబట్టింది. ‘ఈటీవీ విన్’ మద్దతుతో, ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ ఫేమ్ ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ చిత్రాన్ని సాయిమార్తాండ్ డైరెక్ట్ చేశారు.

యూట్యూబర్ మౌళి, నూతన నటీమణి శివాని నగరం హీరో–హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం పెద్దగా హైప్ లేకుండా విడుదలైనా, ఆశించిన దానికంటే ఎనలేని వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ టాక్ మేరకు, ఈ సినిమా ₹40 కోట్లకు పైగా గ్రాస్, దాదాపు ₹30 కోట్ల షేర్ సాధించింది.

మూడు వారాల పాటు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిన్న సినిమా, విడుదల చేసిన బన్నీ వాసు, వంశీ నందిపాటిలకు భారీ లాభాలను తీసుకొచ్చింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మంచి ప్రాఫిట్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఈ ఏడాది “కోర్ట్”, మరికొన్ని చిన్న సినిమాలు కూడా మంచి ఫలితం తెచ్చుకున్నా, ROI (Return on Investment) విషయంలో ‘లిటిల్ హార్ట్స్’ దగ్గర ఏ సినిమా నిలబడలేకపోయింది. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ అయినప్పటికీ, లిటిల్ హార్ట్స్ సాధించిన రాబడితో పోల్చితే అది ఏమీ కాదని ట్రేడ్ స్పష్టం చేస్తోంది.

Tags:    

Similar News