Jana Nayagan: విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. 'జన నాయగన్' విడుదలకు బ్రేక్? మద్రాస్ హైకోర్టులో కీలక పరిణామం!
విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది. సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో జరిగిన వాదనల అనంతరం మద్రాసు హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దీనివల్ల మూవీ రిలీజ్ మరింత ఆలస్యం కానుంది.
దళపతి విజయ్ హీరోగా, హెచ్.వినోద్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan). ఈ సినిమా విడుదల కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తుండగా, సెన్సార్ వివాదం కారణంగా మూవీ రిలీజ్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్‌పై మద్రాసు హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి.
కోర్టులో ఏం జరిగింది?
'జన నాయగన్' చిత్రానికి యూ/ఏ (U/A) సర్టిఫికేట్ ఇవ్వాలని గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు (CBFC) డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.
మూడు గంటల సుదీర్ఘ వాదనలు: మంగళవారం చీఫ్ జస్టిస్ మహీంద్ర మోహన్ శ్రీవాత్సవ, జస్టిస్ జి. అరుళ్ మురుగన్‌లతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. దాదాపు మూడు గంటల పాటు ఇరువర్గాల లాయర్లు తమ వాదనలను వినిపించారు.
సెన్సార్ బోర్డు వర్సెస్ నిర్మాతలు
CBFC వాదన: సినిమాను మరోసారి రివిజన్ కమిటీకి పంపాలని తాము సూచించినా నిర్మాతలు పట్టించుకోలేదని, తమ వాదనలు వినకుండానే సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిందని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఏఆర్‌ఎల్ సుందరేశన్ పేర్కొన్నారు.
నిర్మాతల వాదన: సెన్సార్ బోర్డులోని మెజారిటీ సభ్యులు సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పినప్పటికీ, ఒక్క సభ్యుడి అభిప్రాయం కోసం బోర్డు నిర్ణయాన్ని మార్చుకుందని సీనియర్ న్యాయవాది సతీష్ పరాశరన్ వాదించారు. బోర్డు చెప్పిన సన్నివేశాలను ఇప్పటికే తొలగించామని, కేవలం సర్టిఫికేట్ ఇవ్వకుండా సినిమాను అటూ ఇటూ తిప్పుతూ వేధిస్తున్నారని కోర్టుకు తెలిపారు.
తీర్పు రిజర్వ్.. విడుదలపై సస్పెన్స్!
ఇరుపక్షాల వాదనలు విన్న మద్రాసు హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కోర్టు ఇచ్చే తీర్పుపైనే ఈ సినిమా భవితవ్యం ఆధారపడి ఉంది. ఒకవేళ తీర్పు సెన్సార్ బోర్డుకు అనుకూలంగా వస్తే, సినిమా రివిజన్ కమిటీకి వెళ్లాల్సి ఉంటుంది. ఫలితంగా సినిమా విడుదల మరికొన్ని వారాలు ఆలస్యం కావచ్చు. విజయ్ రాజకీయ అరంగేట్రం నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో, తాజా పరిణామాలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.