Brahma Anandam Review: మానవ బంధాల గొప్పతనాన్ని చెప్పే, భావోద్వేగాల 'బ్రహ్మ ఆనందం'... ఏడిపించేశారుగా..!

Brahma Anandam Review: కామెడ్‌ కింగ్ బ్రహ్మానందం ఇటీవల సినిమాలు బాగా తగ్గించేశారు.

Update: 2025-02-14 07:03 GMT

Brahma Anandam Review: మానవ బంధాల గొప్పతనాన్ని చెప్పే, భావోద్వేగాల 'బ్రహ్మ ఆనందం'... ఏడిపించేశారుగా..!

Brahma Anandam Review: కామెడ్‌ కింగ్ బ్రహ్మానందం ఇటీవల సినిమాలు బాగా తగ్గించేశారు. గుండె శస్త్రచికిత్స తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న బ్రహ్మీ అడపాదడపా చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఫుల్‌ లెంగ్త్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. తనయుడు రాజా గౌతమ్‌తో కలిసి బ్రహ్మా ఆనందం సినిమాతో శుక్రవారం ప్రేక్షకులను పలకరించాడు. విడుదలకు ముందే మంచి టాక్‌ సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంది.? తెలియాంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథేంటంటే..

బ్రహ్మానందం (రాజా గౌతమ్) నటుడు కావాలని కలలు కంటాడు. సినిమాల్లో అవకాశం పొందే లక్ష్యంతో ఇతర పనులన్నింటినీ పక్కన పెట్టి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇక అతని తాత ఆనంద్ రామ్మూర్తి (బ్రహ్మానందం) ఓల్డ్ ఏజ్ హోమ్‌లో జీవనం సాగిస్తుంటాడు. ఈ నేపథ్యంలో బ్రహ్మానందం రాసిన నాటకం నేషనల్ లెవల్ థియేటర్ ఆర్టిస్ట్ కాంపిటేషన్‌కి ఎంపిక అవుతుంది. కానీ పోటీలో పాల్గొనడానికి రూ. 6 లక్షల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని సమకూర్చేందుకు అతను అనేక రకాలుగా ప్రయత్నిస్తాడు, అయితే అనుకున్నంత సులభంగా ఆ డబ్బు రాదు. ఈ క్రమంలో అతను ప్రేమించిన ప్రియురాలిని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరోవైపు, ఆనంద్ రామ్మూర్తి తన దగ్గర ఉన్న భూమి గురించి చెప్పి, తాను చెప్పిన విధంగా చేస్తే ఆ డబ్బులు ఇస్తానని బ్రహ్మానందంతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. దీంతో బ్రహ్మానందం ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ అతనికి ఏం జరిగింది? ఆరు లక్షలు సమకూర్చుకున్నాడా? తన ప్రేమను నిలబెట్టుకోగలిగాడా? ముఖ్యంగా, తన తాతతో దూరంగా ఉండాల్సిన అసలైన కారణం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది.?

నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ ఈ సినిమాలో తాతా-మనవళ్లుగా నటించడం ఆసక్తికరమైన విషయం. ఈ కారణంగా సినిమాపై అంచనాలు పెరిగాయి. కథలో, తాతా-మనవళ్లు ఏదో కారణంతో దూరంగా ఉంటారు. కానీ చిన్న భావోద్వేగాలతో మళ్లీ దగ్గరవడంతో కథ మలుపు తిరుగుతుంది. నటుడిగా పేరు తెచ్చుకోవాలని కోరుకున్న మనవడు తాత ఊరికి వెళ్లడం, అక్కడ ఆనంద్ రామ్మూర్తి ఇచ్చే అనూహ్యమైన మలుపు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. మానవ సంబంధాలను సున్నితంగా చిత్రీకరించడం ఈ సినిమాకు హైలైట్. ముఖ్యంగా, కథానాయకుడిని మొదట స్వార్థపూరితంగా చూపించి, చివరికి డబ్బుకు మించిన విలువ మానవ సంబంధాలకే ఉందని చాటించడం భావోద్వేగపూరితంగా తెరకెక్కించబడింది. దర్శకుడు కామెడీ, ఎమోషన్ కలగలిపి కథను చక్కగా నడిపించాడని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలాన్నిచ్చాయి. అలాగే, నిర్మాణ విలువలు కూడా మెరుగ్గా కనిపిస్తాయి.

ఇక బ్రహ్మానందం తన నటనతో ఎప్పటిలాగే మెస్మరైజ్‌ చేశారు. ఆనంద్ రామ్మూర్తి పాత్రలో మెప్పించాడు. ఆయన కుమారుడు రాజా గౌతమ్ తన పరిధి మేరకు నటించి మెప్పించాడు. వెన్నెల కిషోర్ ఈ సినిమాలో తనదైన మార్క్ నటనతో నవ్వించాడు. మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు తమ క్యారెక్టర్స్ లో మెప్పించారు. మొత్తం మీద ఈ సినిమాను కుటుంబంతో కలిసి జాలిగా చూసేయొచ్చు.

Tags:    

Similar News