Acharya Genuine Review: ఆచార్య రివ్యూ.. అవుట్ డేటెడ్ కథ.. బోరింగ్ స్క్రీన్ ప్లే...

Acharya Genuine Review: కొరటాల శివ ఇద్దరు స్టార్ హీరోలతో మంచి సినిమా తెరకెక్కించడంలో విఫలం అయ్యారు అని చెప్పుకోవాలి...

Update: 2022-04-29 07:23 GMT

Acharya Genuine Review: ఆచార్య రివ్యూ.. అవుట్ డేటెడ్ కథ.. బోరింగ్ స్క్రీన్ ప్లే...

Acharya Genuine Review: 

చిత్రం: ఆచార్య

నటీనటులు: చిరంజీవి, రామ్ చరణ్, పూజ హెగ్డే, సోను సూద్, జిషు సేన్ గుప్తా, వెన్నెల కిషోర్, సౌరవ్ లోకేష్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, తదితరులు

సంగీతం: మణి శర్మ

సినిమాటోగ్రఫీ: తిరు

నిర్మాతలు: రామ్ చరణ్, కొరటాల శివ

దర్శకత్వం: కొరటాల శివ

బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్

విడుదల తేది: 29/04/2022

మొట్టమొదటిసారిగా మెగాస్టార్ చిరంజీవి తన తనయుడైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా "ఆచార్య". మెగాస్టార్ హీరోగా రామ్ చరణ్ క్యామియో పాత్రలో కనిపించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. రామ్ చరణ్ ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారితో సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఇవ్వాళ అనగా ఏప్రిల్ 29, 2022 న థియేటర్లలో విడుదలైంది. మరి మెగా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూసిన ఈ మెగా మల్టీస్టారర్ సినిమా ఎలా ఉందో చూసేద్దామా..

కథ:

ఆలయ పట్టణం గా పిలువబడే ధర్మస్థలి బసవ (సోనుసూద్) కంట్రోల్ లో ఉంటుంది. బసవ తన గ్యాంగ్ తో కలిసి ఆ నగరాన్ని అవినీతితో నడిపిస్తూ ఉంటాడు. పాదఘట్టం లో ఉండే ఆయుర్వేద నిపుణులు కూడా బసవ అరాచకాలకు బలవుతుంటారు. అప్పుడే ధర్మస్థలి మరియు పాదఘట్టం ప్రజలను కాపాడటానికి ఆచార్య (చిరంజీవి) రంగంలోకి దిగుతారు. సిద్ధ (రామ్ చరణ్) తో ఆచార్య ఫ్లాష్ బ్యాక్ మాఫియా మరియు మైనింగ్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుంది. వీరిద్దరూ కలిసి ఈ రెండు ఊర్లలో జరుగుతున్న అన్యాయాలను ఏ విధంగా ఆపారు? బసవ పై వీరిద్దరూ విజయం సాధించారా? అసలు సిద్ధ మరియు ఆచార్య మధ్య బంధం ఏంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

ఆచార్య పాత్రలో మెగాస్టార్ చిరంజీవి అద్భుతంగా నటించారు. తన పాత్రలో ఒదిగిపోయి తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు చిరంజీవి. సిద్ధ పాత్రలో రామ్ చరణ్ అదరగొట్టారు. సినిమాలో రామ్ చరణ్ పాత్ర నిడివి దాదాపు 30 నిమిషాలకు పైగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం రామ్ చరణ్ పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుంది. అయితే చిరంజీవి, రామ్ చరణ్ ల పాత్రలకి తగ్గ ఎలివేషన్లు లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. రామ్ చరణ్ మరియు చిరంజీవి ల స్క్రీన్ ప్రెజెన్స్ మరియు వారి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. తన పాత్ర పరిధి మేరకు పూజా హెగ్డే కూడా పర్వాలేదు అనిపించింది. సోను సూద్ నటన ఈ సినిమా కి అతి పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

కొరటాల శివ ఇద్దరు స్టార్ హీరోలతో మంచి సినిమా తెరకెక్కించడంలో విఫలం అయ్యారు అని చెప్పుకోవాలి. తన స్లో నెరేషన్ తో చాలావరకు ప్రేక్షకులకు సినిమా బోర్ కొడుతుంది. ఒక రెండు మూడు హైలెట్ సన్నివేశాలు తప్ప సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్లు కూడా లేవు. కొరటాల ఎంచుకున్న అవుట్ డేటెడ్ కదా బోరింగ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులు సినిమాకి ఏ మాత్రం కనెక్ట్ అవ్వలేదు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఆచార్య సినిమా నిర్మాణ విలువల విషయంలో రామ్ చరణ్ ఏమాత్రం కాంప్రమైజ్ అవకుండా మంచి బడ్జెట్ ను పెట్టారు. ఒకటి రెండు పాటలు బాగానే హిట్టయ్యాయి కానీ మిగతా పాటలు అంత ఆకట్టుకునేలా లేవు. సినిమా నేపధ్య సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకి మంచి విజువల్స్ ని అందించారు. ఎడిటింగ్ ఏమాత్రం బాగాలేదు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఏమాత్రం బాగాలేదు.

బలాలు:

చిరు, చరణ్ ల నటన

ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్

భలే భలే బంజారా పాట

బలహీనతలు:

చిరంజీవి పాత్ర చాలా వీక్ గా ఉండడం

ఎంటర్టైన్మెంట్ లేకపోవడం

అభిమానులకు నచ్చే ఎలిమెంట్స్ లేకపోవడం

వీక్ స్టోరీ

దర్శకత్వం

చివరి మాట:

మెగాస్టార్ ఇంట్రడక్షన్ సన్నివేశం అంచనాలకు ఏమాత్రం చేరుకోలేదు. సినిమా మొదటి పావుగంట మాత్రమే బాగుంటుంది. ఆ తరువాత కథ మరియు స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిస్తాయి. ఏ పాత్ర కి అనుకున్న స్థాయిలో ఎలివేషన్లు లేకపోవటం సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. రెజీనా తో వచ్చే ఐటమ్ సాంగ్ పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాలో ఇంటర్వల్ సన్నివేశం చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ పై ప్రేక్షకులకు ఆశలు కలిగేలా చేస్తుంది. అయితే సిద్ధ ఎంట్రీ తర్వాత కూడా కథ అంతే స్లోగా నడుస్తుంది. రామ్ చరణ్ మరియు పూజా హెగ్డే ల మధ్య వచ్చే నీలాంబరి పాట మరియు భలే భలే బంజారా పాటలు బాగానే అనిపించాయి. సినిమా చివరగా ఆచార్య సినిమా అన్ని రకాలుగా గా ఒక బోరింగ్ సినిమాగా నిలుస్తుంది. తన స్లో నెరేషన్ తో ఎలివేషన్ లు లేని కథతో కొరటాల శివ మెగా అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచారు.

బాటమ్ లైన్:

"ఆచార్య" బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారనున్న సినిమా.

Tags:    

Similar News