Why You Should Never Kiss a Newborn Baby? అయితే జాగ్రత్త! ఆ ప్రేమ బిడ్డ ప్రాణాలకే ముప్పు కావచ్చు.. డాక్టర్ల హెచ్చరిక!
చిన్న పిల్లలను ముద్దు పెట్టుకోవడం వల్ల వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హెర్పెస్, ఆర్‌ఎస్‌వీ వంటి వైరస్‌లు సోకే ప్రమాదం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
చూడగానే ముద్దు వచ్చే పసిపిల్లల బుజ్జి బుగ్గలను చూడగానే ఎవరికైనా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ, ఆ ముద్దులే పసికందుల ప్రాణాల మీదకు తెస్తాయని మీకు తెలుసా? మనం చూపే అతి ప్రేమ బిడ్డను ఆసుపత్రి పాలు చేసే ప్రమాదం ఉందని ప్రముఖ పీడియాట్రిషియన్, నియోనాటాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ యలముడి హెచ్చరిస్తున్నారు.
ఎందుకు ముద్దు పెట్టుకోకూడదు?
చిన్న పిల్లలు పుట్టినప్పుడు వారిలో రోగనిరోధక శక్తి (Immunity) చాలా తక్కువగా ఉంటుంది. బయట ప్రపంచంలోని క్రిములతో పోరాడే సామర్థ్యం వారి శరీరానికి వెంటనే రాదు. మనం ముద్దు పెట్టుకున్నప్పుడు మన నోటిలోని లాలాజలం ద్వారా ఎన్నో రకాల బ్యాక్టీరియాలు, వైరస్‌లు వారి శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తాయి.
ముద్దు ద్వారా సోకే ప్రమాదకర వైరస్‌లు:
పెద్దవారికి సాధారణంగా అనిపించే జలుబు కూడా పసిబిడ్డల విషయంలో ప్రాణాంతకం కావచ్చు. ముఖ్యంగా ఈ మూడు వైరస్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి:
- హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ (Herpes Simplex Virus): దీనిని 'కిస్ ఆఫ్ డెత్' అని కూడా పిలుస్తారు. పెద్దవారిలో ఇది కేవలం పెదవుల దగ్గర పుండ్లలా కనిపిస్తుంది. కానీ పసిపిల్లలకు సోకితే ఇది మెదడు వాపు వ్యాధికి దారితీసి ప్రాణాలకే ముప్పు కలిగిస్తుంది.
- ఆర్.ఎస్.వి (RSV): ఇది తీవ్రమైన శ్వాసకోస సమస్యలను కలిగిస్తుంది. ఊపిరితిత్తులపై ప్రభావం చూపి, బిడ్డకు ఊపిరి తీసుకోవడం కష్టతరం చేస్తుంది.
- ఫ్లూ (Flu): సాధారణ జలుబు, దగ్గు కూడా పసివారిలో తీవ్రమైన జ్వరాన్ని, నీరసాన్ని కలిగిస్తాయి.
మొహమాటం వద్దు.. బిడ్డ ఆరోగ్యమే ముఖ్యం!
"ఎవరైనా మీ పిల్లల్ని ముద్దు పెట్టుకుంటుంటే మొహమాటపడకుండా 'వద్దు' అని చెప్పండి" అని డాక్టర్ గౌతమ్ సూచిస్తున్నారు.
బంధువులు ఏమనుకుంటారో అని సంకోచించి బిడ్డ ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దు.
కనీసం ఒక సంవత్సరం వయస్సు వచ్చే వరకు పిల్లలను ఎవరూ ముద్దు పెట్టుకోకుండా చూడటం ఉత్తమం.
బయటి నుండి వచ్చిన వారు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే బిడ్డను తాకనివ్వండి.
ప్రేమను ఎలా చూపించాలి?
పిల్లలపై ఆప్యాయతను చాటడానికి ముద్దు ఒక్కటే మార్గం కాదు. ముద్దుకు బదులుగా వారిని ప్రేమగా ఎత్తుకోవడం, హగ్ చేసుకోవడం వంటివి చేయవచ్చు. మీ ఇంటికి వచ్చే అతిథులకు కూడా పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుందని, ఇన్ఫెక్షన్లు త్వరగా సోకుతాయని సున్నితంగా వివరించండి.
గుర్తుంచుకోండి.. పసిప్రాయంలో మనం తీసుకునే చిన్నపాటి జాగ్రత్తలే వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి.