Cabbage Tapeworm: క్యాబేజీ తింటున్నారా? వండకముందు ఇలా చేయకపోతే ప్రాణాలు పోతాయ్..!!
Cabbage Tapeworm: క్యాబేజీ తింటున్నారా? వండకముందు ఇలా చేయకపోతే ప్రాణాలు పోతాయ్..!!
Cabbage Tapeworm: సాధారణంగా మనం రోజూ తినే కూరగాయలే కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారతాయని తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. క్యాబేజీలో ఉండే టేప్‌వార్మ్ (బద్దెపురుగు) కారణంగా ఢిల్లీలో ఓ విద్యార్థిని బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌కు గురై మరణించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆరోగ్య నిపుణులు ఇది నిర్లక్ష్యానికి దారితీసే తీవ్రమైన సమస్యగా హెచ్చరిస్తున్నారు.
డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలకూర, వంకాయ వంటి నేలపై లేదా నేలకు సమీపంగా పెరిగే కూరగాయల్లో టేప్‌వార్మ్ గుడ్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కూరగాయలను సరిగా కడగకుండా లేదా పూర్తిగా ఉడికించకుండా తినడం వల్ల ఆ గుడ్లు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఒకసారి అవి మన జీర్ణాశయంలోకి వెళ్లాక రక్తప్రసరణ ద్వారా మెదడుకు చేరి తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి. ఈ పరిస్థితిని వైద్య భాషలో న్యూరోసిస్టిసెర్కోసిస్ (Neurocysticercosis) అంటారు. ఈ వ్యాధి బారిన పడిన వారికి అకస్మాత్తుగా ఫిట్స్ రావడం, తీవ్రమైన తలనొప్పులు, వాంతులు, చూపు మందగించడం, కొన్ని సందర్భాల్లో మూర్ఛలు కూడా వస్తాయి. పరిస్థితి తీవ్రత పెరిగితే ప్రాణాపాయం కూడా ఉండొచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ఢిల్లీ ఘటనలో మరణించిన విద్యార్థిని తరచూ సలాడ్స్, సగం ఉడికిన కూరగాయలను తీసుకునేదని వైద్యులు వెల్లడించారు. చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చినప్పటికీ మెదడులో ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా ఉండటంతో ఆమెను కాపాడలేకపోయారు. ఈ ఘటన తర్వాత ప్రజలు ఆహార పరిశుభ్రతపై మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నిపుణుల సూచనల ప్రకారం, కూరగాయలను వండే ముందు కనీసం 3 నుంచి 4 సార్లు శుభ్రమైన నీటితో కడగాలి. వీలైతే ఉప్పు నీరు లేదా వెనిగర్ కలిపిన నీటిలో కొంతసేపు నానబెట్టాలి. ముఖ్యంగా క్యాబేజీ, కాలీఫ్లవర్ లాంటి కూరగాయలను ఆకులుగా విడదీసి ఒక్కో ఆకును బాగా శుభ్రం చేయాలి. పూర్తిగా ఉడికించకుండా తినకూడదని, సలాడ్స్ విషయంలో మరింత జాగ్రత్త అవసరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, ఆరోగ్యమే సంపద అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.