Story Behind Diwali Festival: దీపావళి పండగ వెనుక ఇంత పెద్ద కథ ఉందా? యముడినే వెనక్కి పంపించిన ఆ కథ మీకూ తెలుసా?

Update: 2024-10-24 14:25 GMT

Story Behind Diwali Festival: దీపావళిని మూడు రోజుల పాటు సెలబ్రేట్ చేసుకునే ఆనవాయితీ ఉంది. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి.. ఇలా మూడు రోజుల పాటు వేడుకలు జరుపుకుంటారు. ఈసారి అక్టోబర్ 29న ధన త్రయోదశి, 30న నరక చతుర్దశి, 31న దీపావళి రానున్నాయి. ధనత్రయోదశి రోజున ఏదైనా కొత్త వస్తువు తీసుకోవడం శుభసూచకమని కొందరి నమ్మకం. ముఖ్యంగా బంగారం కొంటే ఇంకా బాగా కలిసొస్తుందనేది మరి కొందరి నమ్మకం.

ధనత్రయోదశి రోజున చీపురు తీసుకొని వస్తే మంచి జరుగుతుందని భావించే వాళ్లు కూడా ఉన్నారు. అంతేకాదు ఇంటికి లక్ష్మీదేవి ఫొటో, జంటగా ఉన్న ఏనుగుల్ని తెచ్చుకుంటే ఎంతో కలిసి వస్తుందనేది భక్తుల విశ్వాసం. ఎందుకంటే.. లక్ష్మీదేవీకి ఇరువైపుల ఏనుగులు ఉండటం వంటి ఫోటోలను, వీడియోలను మీరు కూడా చూసే ఉంటారు. ఆ ఏనుగులను విఘ్నేశ్వరుడికి చిహ్నంగా చెబుతుంటారు. ఆయన మన విఘ్నాలను తొలగించడంతో పాటు మంచి చేస్తారని కూడా అంటుంటారు. అంతే కాకుండా.. తామర పువ్వును, తాబేలు ప్రతిమను కూడా ఇంటికి

తీసుకొని వస్తే, ఇంట్లో సిరులు నాట్యం చేస్తాయని కూడా పండితులు చెబుతున్నారు. ఇలాంటి పనుల వల్ల జీవితంలో అనుకోని విధంగా మార్పులు సంభవిస్తాయని జ్యోతిష్య పండితులు చెప్పే మాట. ఇవన్నీ కూడా ధన త్రయోదశికి, దీపావళి పండగకు ముడిపడి ఉన్న బలమైన నమ్మకంగా భక్తులు చెబుతుంటారు. అయితే, ఈ పండుగలో అంతకు మించిన విశేషాలు కూడా ఉన్నాయంటున్నారు.

ధనత్రయోదశినాడే లక్ష్మీదేవి క్షీరసాగరమధనం నుంచి ఉద్భవించిందంటారు. అందుకే లక్ష్మీదేవి ఆవిర్భావానికి సూచనగా ఆమె చిహ్నాలైన బంగారపు వస్తువులను కొందరు పాలతో కడుగుతారు. లక్ష్మీదేవి సంపదను అందించే తల్లి కాబట్టి ఆ రోజు వెండి, బంగారం వంటి ఆభరణాలను కానీ ఇతరత్రా కొత్త వస్తువులను కానీ తీసుకోవడం శుభం అని నమ్ముతారు. ఇక వ్యాపారపరమైన లెక్కలను చూసుకునేందుకు కూడా ఇది శుభకరమైన రోజుగా భావిస్తారు.

యముడిని ప్రసన్నం చేసుకునేలా ధనత్రయోదశి రాత్రివేళంతా దీపాలను వెలిగించే ఆచారం కూడా ఉత్తరాదిన విస్తృతంగా కనిపిస్తుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ప్రచారంలో ఉంది. ఆ కథ ఏం చెబుతోందంటే.. పూర్వం హిమరాజు తనయుడికి పెళ్లయిన నాలుగో రోజున పాముకాటుతో మృత్యుగండం ఉందని జ్యోతిషులు చెబుతారు. ఈ విషయం తెలిసిన పెళ్లికూతురు ఆ రోజు రాత్రి తన ఆభరణాలన్నింటినీ రాశులుగా పోసి అవి జిగేలుమని మెరిసేలా దీపాలను వెలిగించి, ఆపై కోటలో ఎవ్వరూ నిద్రపోకుండా ఉండేలా కథలు చెబుతూ ఉండిపోయిందట. రాజకుమారుని జాతకం ప్రకారం అతడిని పాము రూపంలో కాటేసేందుకు వచ్చిన యముడికి... ధగధగా మెరిసిపోతున్న ఆభరణాలను చూసి కళ్లు బైర్లు కమ్మాయంట. రాత్రంతా వేచి చూసినా కోట లోపలకి వెళ్లే అవకాశం దొరక్కపోవడంతో నిరాశగా వెనుతిరిగాడట. అప్పటి నుంచి ఈ దీపాన్ని వెలిగించే ఆచారం మొదలైంది అనేది ఆ కథ సారాంశం అని కొంతమంది పెద్దలు చెబుతారు.

ధనత్రయోదశి నాడు వచ్చే మరో ముఖ్యమైన సందర్భం- ధన్వంతరి జయంతి. అపర వైద్యుడు ధన్వంతరి కూడా క్షీరసాగరమధనంలో, ఈ రోజునే ఉద్భవించాడని నమ్మకం. అసలు ధన త్రయోదశి అన్న పేరు ధన్వంతరి నుంచే వచ్చిందని వాదించేవారూ లేకపోలేదు. భూలోకంలో అనారోగ్యంతో ఉన్నవారికి తగిన ఔషధాలను సూచించేందుకు, ఆ విష్ణుమూర్తే ధన్వంతరిగా అవతరించాడంటారు. దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం పొందాలన్నా, ఎలాంటి అనారోగ్య సమస్య నుంచైనా తక్షణం తేరుకోవాలన్నా.. ధన్వంతరిని ప్రార్థిస్తే ఫలితం ఉంటుందట. ఆయుర్వేదానికి వైద్యానికి ధన్వంతరి ఆదిగురువు కాబట్టి, ఈ రోజున వైద్యులంతా ఆయనను తల్చుకోవడం పరిపాటి అని కూడా కొంతమంది పెద్దలు చెబుతుంటారు.

Tags:    

Similar News