Health: లంగ్స్ మాత్రమే కాదు.. స్మోకింగ్‌తో వీటిపై కూడా ప్రభావం..
Health: స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరమని తెలిసినా పొగరాయుళ్లు మాత్రం ఆ అలవాటును మానుకోవడానికి ఇష్టపడరు.
Health: స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరమని తెలిసినా పొగరాయుళ్లు మాత్రం ఆ అలవాటును మానుకోవడానికి ఇష్టపడరు. అయితే పొగాకు వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తుంటారు. మనలో చాలా మంది స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తుల సమస్యలు మాత్రమే వస్తాయని అనుకుంటారు. అయితే స్మోకింగ్‌తో ఇతర సమస్యలు కూడా ఉన్నాయని మీకు తెలుసా.?
* సిగరెట్ తాగేవారికి గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశం 2-4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. నికోటిన్, టార్ లాంటి పదార్థాలు రక్తనాళాలు ఇరుకుగా చేస్తాయి. పొగలో ఉండే కార్బన్ మోనాక్సైడ్ శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. ఇవి గుండెపోటుకు కారణమవుతాయి.
* సిగరెట్ పొగ మెదడుకి అవసరమైన ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుంది. దీని వల్ల జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది, ఏకాగ్రత తగ్గుతుంది. స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
* ధూమపానం వల్ల చర్మం తేలిపోతుంది, తేమ కోల్పోతుంది. ముడతలు, మచ్చలు వస్తాయి. చర్మం కాంతిని కోల్పోయి నల్లగా మారుతుంది. వృద్ధాప్యం ముందుగానే వస్తుంది.
* ధూమపానం మూత్రపిండాల పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది. కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమారు 50% పెరుగుతుంది. రక్తపోటు పెరిగి కిడ్నీల పనితీరు మందగిస్తుంది.
* సిగరెట్ పొగ కళ్ళలోని రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీని వల్ల దృష్టి క్రమంగా తగ్గిపోతుంది.పూర్తిగా చూపు కోల్పోయే అవకాశం కూడా ఉంది. వయస్సుతో వచ్చే మాక్యులర్ డీజెనరేషన్ (AMD) వచ్చే అవకాశం మూడింతలు ఎక్కువగా ఉంటుంది.
మొత్తం మీద, సిగరెట్ తాగడం వల్ల శరీరంలోని ప్రతీ అవయవం నెమ్మదిగా దెబ్బతింటోంది. అందుకే స్మోకింగ్ అలవాటును వీలైనంత త్వరగా మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.