Multivitamin Side Effects: నీరసంగా ఉందని విటమిన్ టాబ్లెట్లు మింగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కొంచెం నీరసంగా అనిపించినా, అలసటగా ఉన్నా వెంటనే మల్టీ విటమిన్ టాబ్లెట్లు వేసుకునే అలవాటు చాలామందికి పెరిగిపోయింది.

Update: 2026-01-03 05:20 GMT

Multivitamin Side Effects: నీరసంగా ఉందని విటమిన్ టాబ్లెట్లు మింగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త

Multivitamin Side Effects: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కొంచెం నీరసంగా అనిపించినా, అలసటగా ఉన్నా వెంటనే మల్టీ విటమిన్ టాబ్లెట్లు వేసుకునే అలవాటు చాలామందికి పెరిగిపోయింది. ఏదో ఒక మ్యాజిక్ జరిగినట్లు ఈ మాత్రలు మనకు తక్షణ శక్తిని ఇస్తాయని భ్రమపడుతుంటాం. కానీ, వైద్యుల హెచ్చరిక ప్రకారం.. అవసరం లేకున్నా విటమిన్ మాత్రలు వాడటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. మన శరీరానికి ఏం కావాలో తెలుసుకోకుండా, కేవలం అలసటను తగ్గించుకోవడానికి మందులపై ఆధారపడటం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

చాలామంది అలసటను ఒక జబ్బుగా భావిస్తారు. కానీ నిజానికి అలసట అనేది మన శరీరంలో ఏదో లోపం ఉందని లేదా విశ్రాంతి కావాలని శరీరం ఇచ్చే ఒక లక్షణం మాత్రమే. సరైన నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, శరీరానికి సరిపడా నీరు అందకపోవడం వల్ల నీరసం రావడం సహజం. ఇలాంటి సమయంలో అసలు కారణాన్ని వదిలేసి మల్టీ విటమిన్ మాత్రలు వాడటం వల్ల ఉపయోగం ఉండదు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఆహారం ద్వారానే విటమిన్లు అందుతాయి, అదనంగా మందులు వాడటం వల్ల కిడ్నీలు, కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది.

శరీరంలో విటమిన్ ఎ, డి, ఇ, కె వంటివి అధికమైతే అవి విషతుల్యంగా మారే అవకాశం ఉంది. విటమిన్ల లోపం ఉందని డాక్టర్లు రక్త పరీక్షల ద్వారా నిర్ధారిస్తేనే మందులు వాడాలి. సొంత వైద్యంతో విటమిన్ మాత్రలు వేసుకుంటే వాంతులు, తలనొప్పి, కడుపులో మంట వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆధునిక జీవనశైలిలో మనం నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒక మనిషికి రోజుకు కనీసం 7-8 గంటల గాఢ నిద్ర అవసరం. నిద్ర సరిగ్గా ఉంటే సగం అలసట దానంతట అదే మాయమవుతుంది.

పరీక్షల సమయంలో విద్యార్థులు నిద్రను త్యాగం చేసి చదువుతుంటారు. దీనివల్ల బ్రెయిన్ ఫాగ్ ఏర్పడి ఆ చదివింది కూడా గుర్తుండదు. నీరసం తగ్గాలంటే విటమిన్ మాత్రల కంటే కొన్ని చిట్కాలు పాటించడం మేలు. పడక గదిలో మంచం మీద కూర్చుని చదవకండి, అది నిద్రను ప్రేరేపిస్తుంది. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోండి. నిద్రపోయే కనీసం గంట ముందు మొబైల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలి. వీటి నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రను పాడు చేస్తుంది.

రాత్రి పూట కెఫిన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీలు తాగడం మానుకోవాలి. అలాగే మసాలా వంటకాలు, పంచదార ఎక్కువగా ఉండే పదార్థాలు నిద్రకు భంగం కలిగిస్తాయి. వీటివల్ల ఉదయం లేవగానే మళ్ళీ అలసటగా అనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం, పుష్కలంగా నీరు, క్రమబద్ధమైన నిద్ర ఉంటే చాలు. విటమిన్ మాత్రలు కేవలం డాక్టర్ సూచించినప్పుడే వాడాలి. ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు, కూరగాయల ద్వారా విటమిన్లు పొందడమే అత్యుత్తమ మార్గం.

Tags:    

Similar News