పనసకాయ పచ్చడి తయారీ ఎలా?

Update: 2019-06-26 16:31 GMT

పనసపండులో విటమిన్ ఎ, విటమిన్ సి తో పాటు మెగ్నీషియం, ఫైబర్, ఇతర ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యల నుంచి కాపాడతాయి. పనస పండులో ఉన్న పొటాషియం రక్తపోటును అదుపు చేస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటే గుండెకు సంబంధించిన సమస్యలు రావని వైద్యులు చెబుతున్నారు. పనస జీర్ణశక్తిని పెంచుతుంది. పనసపండులో ఉన్న విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. జుట్టుకు బలాన్ని ఇస్తుంది.

కావలసిన పదార్ధాలు :

పచ్చిపనస ముక్కలు- కేజీ

ఆవనూనె- 350గ్రా

పచ్చి మామిడి కాయలు- రెండు

సోంపు- నాలుగు చెంచాలు

మెంతులు- మూడుచెంచాలు

ఆవాలు- ఐదుచెంచాలు

కారం- నాలుగు చెంచాలు

పసుపు- చెంచా

ఉప్పు, ఇంగువ- తగినంత

తయారీ విధానం :

పచ్చిపనస ముక్కలని ఆవకాయ ముక్కల సైజుకంటే కాస్త పెద్దగా తరిగి పెట్టుకుని గింజలు తీసేయాలి. ఈ ముక్కలకు తగినన్ని నీళ్లలో పసుపు, ఉప్పు వేసుకుని పూర్తిగా కాకుండా ముక్క మూడొంతులు ఉడికే వరకూ ఉంచి నీళ్లను వడకట్టుకోవాలి. ఈ ముక్కలని తడి లేకుండా ఎండలో ఒక వస్త్రంపై పరిచి ఐదు ఆరు గంటల పాటు ఎండ బెట్టుకోవాలి. తడి ఉండకుండా చూసుకోవాలి . స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె లేకుండా సోంపు, మెంతులని వేయించుకుని ఆవాలతో కలిపి పొడి చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆవనూనె వేడి చేసుకుని స్టౌ ఆఫ్ చేయాలి. ఈ నూనెలో సోంపు, మెంతులు, ఆవపొడి మిశ్రమం, కారం, ఉప్పు, ఇంగువ వేసుకుని మామిడికాయ ముక్కలు, పనసకాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జాడీలో నింపుకొని వారం రోజుల పాటు మంచి ఎండలో ఉంచి తీసి లోపలపెట్టాలి. ఈ పచ్చడి వారం తర్వాత ఊరి బాగుంటుంది. రెండు చెంచాల వెనిగర్‌ వేస్తే పచ్చడి పాడుకాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే పండిన పనసకాయ ఈ పచ్చడికి పనికిరాదు. అలాగే ముక్కల్లో తడిలేకుండా చూసి పచ్చడి పెట్టుకోవాలి.

Tags:    

Similar News